Survey on JanaSena Pawan Kalyan contesting constituencyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019లో పూర్తి స్థాయిలో అమరావతికి షిఫ్టు అయిపోయి పార్టీ మీద దృష్టి సారిస్తున్నారు. అమరావతిలో అందుబాటులో ఉంటూ పార్టీ నాయకులకు, శ్రేణులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పాడేరు లో ఒక బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం గుంటూరులో ఇంకో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఫిబ్రవరి లో అభ్యర్థులను ఖరారు చెయ్యడం మొదలు పెడతారట.

అప్పుడే సీట్ల పంపకంపై వామపక్ష పార్టీల తో చర్చిస్తారు. మరో వైపు దీనిపై జనసేన ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబోయే సీటు పై కసరత్తు జరుగుతుంది. ప్రాధమికంగా మూడు నియోజకవర్గాలపై ఆయన దృష్టి సారించినట్టు సమాచారం. పశ్చిమ గోదావరిలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, మరియు విశాఖపట్నం లోని గాజువాక అని తెలుస్తోంది. ఈ మూడు చోట్లలో ఎక్కడో ఒక చోట నుండి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇప్పటికే ఒక సర్వే బృందం ఈ సీట్లలో సర్వే నిర్వహిస్తుందని తెలుస్తోంది. వారి రిపోర్ట్ ని బట్టి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల మీదే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సామాజిక వర్గ లెక్కల ప్రకారం ఈ ఐదు జిల్లాల నుండే జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీనితో అక్కడ నుంచి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ మొత్తం ఆ జిల్లా మీద పడుతుందని పవన్ కళ్యాణ్ భావన. దీనితో అనుకూలమైన సీటు నుండే ఆయన పోటీ చేయబోతున్నారు. మనకు ఉన్న సమాచారం ప్రకారం ఆయన ఏలూరు నుండే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే దీనిపై పార్టీలో భేదాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. అనుకూలమైన చోట నుండి కాకుండా మిగతా జిల్లాల్లో పోటీ చేస్తే అక్కడ పార్టీ బలోపేతం అవుతుందని వారు భావిస్తున్నారు. అయితే కష్టమైన సీటు నుండి పోటీ చేస్తే అక్కడ ఎక్కువ దృష్టి పెట్టి ప్రచారం చేయడానికి సరైన సమయం దొరకదు. దీనితో భారీ నష్టం జరగవచ్చు అని వారి అంచనా. ఈ వాదనతో పవన్ కూడా ఏకీభవించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏలూరులో తన ఓటు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సొంత జిల్లా నుండే పోటీ చేసి చిరంజీవి ఓడిపోయిన సంగతి తెలిసిందే.