survey nadyal by-electionsప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలకు నంద్యాల భయం పట్టుకుంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ భవిష్యత్తుపై భయంతో వణికిపోతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణలు వైసీపీ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి తర్వాత వివిధ కారణాలతో కుమార్తె అఖిలప్రియ, బావమరిది ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. అయితే నాగిరెడ్డి మరణం తర్వాత రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారాయి.

కొందరు భూమా కుటుంబం వెంటే ఉండిపోయినా, 10-15 శాతం మంది మాత్రం వైసీపీతోనే ఉండిపోయారు. అయితే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఎటు వైపు ఉండాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైసీపీ చీఫ్ జగన్ గత కొన్ని రోజులుగా నంద్యాలలో మకాం వేసి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఈ ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్న జగన్, ఎలాగైనా నంద్యాలలో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

సరిగ్గా ఇదే వైసీపీ నేతలను భయపెడుతోంది. ఒకవేళ ఫలితం తమకు వ్యతిరేకంగా వస్తే భవిష్యత్తు ఏంటని భయపడుతున్నారు. ఇప్పటికే ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని చెబుతున్న నేతలు.. ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై పడితే తమ భవిష్యత్తు అంధకారమేనని భయపడుతున్నారు. జగన్ ఈ ఉప ఎన్నికను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోకపోయి ఉంటే, అంతా ‘లైట్’గా తీసుకునేవారని, అప్పుడు ఇంత ప్రాధాన్యత దక్కేది కాదని, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదని అభిప్రాయ పడుతున్నారు.