Survey-KCRఇటీవల సెంటర్‌ ఫర్ నేషనల్ ఓపినీయన్ స్టడీస్ దేశవ్యాప్తంగా సర్వే చేసి దానిలో ఏయే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంత ప్రజధారణ ఉందో తెలుసుకొని ఆ గణాంకాల ఆధారంగా ముఖ్యమంత్రులకు ర్యాంకులు ఇచ్చింది. వాటిలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో ఉండగా, రాజకీయంగా అత్యంత శక్తివంతుడు, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిచేసి చూపుతున్న కేసీఆర్‌ 11వ స్థానంలో ఉండటం విశేషం. కానీ అంతకంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి 21వ స్థానంలో ఉండటం. మరో విదంగా చూస్తే అట్టడుగు నుంచి ఆరో స్థానంలో ఉన్నట్లు లెక్క. .

జగన్మోహన్ రెడ్డి ఏపీ సిఎంగా అధికారం చేపట్టిన మొదటిరోజు నుంచే రాష్ట్రంలో నవరత్నాలు-సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు. వాటి కోసం రాష్ట్రాభివృద్ధిని, రాష్ట్ర భవిష్యత్‌ను కూడా పణంగా పెట్టడానికి వెనకాడటం లేదు. ఆ భారం తగ్గించుకోవడానికి వాటిలో ఆంక్షలు, కోతలు విధిస్తున్నప్పటికీ, ఏదో విదంగా మూడేళ్ళుగా ఓ మహా యజ్ఞంలా వాటిని చేసుకుపోతున్నారు.

కనుక ఏపీలో ప్రజలు తన ఫోటోను దేవుడి గదిలో పెట్టుకొని పూజిస్తుంటారని, వారి గుండెల్లో తాను కొలువై ఉన్నానని జగన్ బలంగా నమ్ముతున్నారు. అదే చెపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల చేత కూడా చెప్పిస్తున్నారు. కానీ సెంటర్‌ ఫర్ నేషనల్ ఓపినీయన్ స్టడీస్ ప్రకటించిన సర్వే అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ఆంద్రప్రదేశ్‌లో 39 శాతం మంది ప్రజలు జగనన్న పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయగా, 29 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని మిగిలిన 32 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఇష్టపడలేదని తెలిపింది.

మూడేళ్ళుగా ఎడాపెడా అప్పులు చేసి ప్రజలకు డబ్బులు పంచిపెడుతున్నా జగనన్న పట్ల 39% మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటి? అంతా మోసం… ఇది దుష్టచతుష్టయం చేయించిన దొంగ సర్వే అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ట్విట్టర్‌లో చంద్రబాబు నాయుడు, ఆంధ్ర జ్యోతిపై విరుచుకు పడ్డారు.

ఒకవేళ కొడాలి నాని వాదిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి కలిసి ఈ నకిలీ సర్వే నివేదిక సృష్టించారనుకొన్నా, కోరుండి తెలంగాణ సిఎం కేసీఆర్‌ను ఈ రొంపిలోకి లాగరు కదా? సీఎన్‌వోఎస్‌ తాజా సర్వే ప్రకారం దేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్, ఆ తరువాత స్థానాలలో యోగి ఆధిత్యనాథ్ (యూపీ), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర మాజీ సిఎం), హిమంత్ బిశ్వ శర్మ (అస్సామ్), భగవంత్ సింగ్ మాన్ (పంజాబ్) నిలిచారు. వారిని పైకెత్తవలసిన అవసరం చంద్రబాబు, ఆంధ్రజ్యోతికి ఏముంది? అని ఆలోచిస్తే కొడాలి నాని వాదన ఎంత అర్దరహితమో తెలుస్తుంది.