suresh raina vs gautam gambhir ipl 2017ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారుతోంది. దాదాపుగా ప్రతి మ్యాచ్ లో గౌరవప్రదమైన స్కోర్ గానీ, భారీ స్కోర్ గానీ చేస్తుండడం… దానిని ప్రత్యర్ధి జట్టు భారీ షాట్లతో విరుచుకుపడుతూ అవలీలగా చేధించడం… క్రికెట్ అభిమానులకు ఓ ఫీస్ట్ లా మారింది. గతంలో కూడా భారీ స్కోర్లు నమోదైనప్పటికీ, ఈ సీజన్ మాత్రం దాని పరిధిని పెంచుకుందని చెప్పవచ్చు. తాజాగా కోల్ కతా – గుజరాత్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు నమోదు కావడంతో క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించగా, 187 పరుగుల భారీ స్కోర్ నైట్ రైడర్స్ సాధించింది. ఊతప్ప 72, ఓపెనర్ నరైన్ 42, గంభీర్ 33, పాండే 24 పరుగులతో రాణించారు. అయితే ఓపెనర్ నరైన్ నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడడంతో, తొలి మూడు ఓవర్లలోనే 44 పరుగులు వచ్చాయి. అందులో నరైన్ 17 బంతులను ఎదుర్కొని 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి, భారీ స్కోర్ కు పునాది వేసాడు. ఆ తర్వాత ఈ ఒరవడిని ఊతప్ప, గంభీర్, పాండేలు కొనసాగించారు.

ఇక, భారీ లక్ష్య చేధనను ధాటిగా ఆరంభించింది గుజరాత్. ఓపెనర్లు ఫించ్, మెక్కల్లంలు భారీ షాట్లతో విరుచుకుపడడంతో తొలి 5వ ఓవర్లో 62 పరుగులు వచ్చేసాయి. ఈ తరుణంలో మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి వర్తిస్తుందని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వరుణ దేవుడు కటాక్షించడంతో మొదలైన మ్యాచ్ లో కోల్ కతా వరుసగా రెండు వికెట్లను పడగొట్టి, మ్యాచ్ పై పట్టు సాధించింది. అయితే క్రీజులో ఉన్న కెప్టెన్ రైనా మ్యాచ్ ను చేజారిపోకుండా చూడడంలో విజయవంతం అయ్యాడు.

భారీ షాట్లతో చెలరేగిన రైనా 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఎండ్ లో విరామం లేకుండా వికెట్లు పడుతున్నా, ఒంటరి పోరాటం చేసి ప్లే ఆఫ్స్ కు అర్హత పొందే అవకాశాలను నిలుపుకున్నాడు. ఈ విజయంతో ఆడిన 6 మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించిన పంజాబ్, బెంగుళూరు జట్ల సరసన గుజరాత్ కూడా నిలిచింది. రైనా తిరిగి ఫాంలోకి రావడంతో గుజరాత్ జట్టు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.