Suresh Productions lockdown for another 3 monthsషూటింగులకు అనుమతించమని రెండు తెలుగు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యాలు ఇచ్చిన తెలుగు చిత్ర ప్రముఖులలో సురేష్ బాబు ఒకరు. అయితే ఆయన ఈ మధ్య తన లైన్ మార్చుకుని ఇప్పట్లో షూటింగులు మొదలుపెట్టడం, థియేటర్లు ఓపెన్ చెయ్యడం మంచిది కాదని బలంగా వాదిస్తున్నారు. మిగతా వారి సంగతి తెలీదు మా సినిమాలు మాత్రం మరో మూడు నెలల వరకు సెట్స్ మీదకు వెళ్లవు అని గట్టిగా చెబుతున్నారు.

“మా బ్యానర్ లోని సినిమాలు అన్నీ కలిపి 27 రోజులు షూటింగ్ మిగిలి ఉంది. అయితే అవన్నీ యాక్షన్ సీన్లే. దాదాపుగా 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిపి ప్రతిరోజు సెట్ లో కనీసం 150 మంది ఉండాల్సిన పరిస్థితి. వారంతా మాస్కులు సరిగ్గా ధరించడం, సోషల్ డిస్టెంసింగ్ పాటించడం సాధ్యం కాదు. రోడ్ల మీద ప్రజలు వీటిని పాటించడం లేదు. స్పాట్ లో ఇంకా కష్టం,” అని చెప్పుకొచ్చారు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రస్తుతం జరుగుతున్న సినిమాలలో ప్రధానమైంది వెంకటేష్ నారప్ప. అలాగే కరోనా కు వాక్సిన్ లేదా మందు లభించే వరకు థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ తన థియేటర్లు మూసి వేసే ఉంటాయని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

సురేష్ బాబు కింద రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 450 థియేటర్లు ఉన్నాయి. ఏది ఏమైనా కనీసం సంక్రాంతి నాటికైనా కరోనా సమస్యకు సరైన పరిష్కారం లభించి, పరిశ్రమ కళకళలాడాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు చెయ్యగలిగిందని ఏమీ లేదు.