కేరళ సూపర్ స్టార్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అయిన సురేష్ గోపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జంధ్యం ధరించే వారందరనీ దేవుళ్లుగా పరిగణించాలని పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనకు పునర్జన్మపై నమ్మకం ఉందని, వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి శబరిమల ఆలయ ప్రధాన పూజారిని అవుతానని పేర్కొన్నారు. తిరువనంతపురంలో బ్రాహ్మణులు నిర్వహించిన ‘యోగక్షేమ సభ’కు హాజరైన సురేశ్ గోపీ ఈ వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.

“పునర్జన్మపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. వచ్చే జన్మలో జంధ్యం ధరించే కులంలో పుడతా. శబరిమల ప్రధాన పూజారిని అవుతా. ఫలితంగా దేవుడిని స్పృశించొచ్చు. స్నానం చేయించొచ్చు” అంటూ తన దైవత్వాన్ని చాటుకున్నారు. అయితే కుల ప్రస్తావన ఉండడంతో, ఈ ‘సూపర్ స్టార్’ వ్యాఖ్యలపై రాష్ట్రంలో సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘పైత్రుకమ్’ అనే సురేష్ గోపి సినిమాలోని డైలాగును ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

“నేను బ్రాహ్మణుడిని కాదు. నేను మనిషిని అంతే. నా జంధ్యాన్ని చింపేస్తున్నా. మొలతాడును ఎప్పుడో తొలగించా” అని ఓ సన్నివేశంలో సురేష్ గోపి చాలా ఆవేశంగా చెప్తారు. తాజాగా దీనిని షేర్ చేసుకుంటూ, సురేష్ గోపీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఇటీవల కాలంలో యువ స్టార్ హీరోలు సంచలన వ్యాఖ్యలకు నిదర్శనంగా నిలుస్తున్న నేపధ్యంలో… అదే బాటలో సురేష్ గోపి వంటి సీనియర్ స్టార్స్ కూడా పయనించడం ఊహించే పరిణామం కాదు.