Surendra babu back to vijayawadaసంచలనమైన రెండు కేసులు విజయవాడ నగరాన్ని కుదిపేస్తున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ రాజకీయ నాయకుల ప్రమేయమే ఎక్కువగా ఉండడంతో విజయవాడ రాజకీయాలు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు పేరు మారుమ్రోగుతుండగా, కాల్ మనీ స్కాంలో అధికార, విపక్ష సభ్యుల పేర్లన్నీ వినపడుతున్నాయి. అయితే అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలు బోడే ప్రసాద్, బుద్ధా వెంకన్నల పేర్లు ప్రధానంగా వినపడుతుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

ఈ తరుణంలో విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ నెల రోజుల పాటు సెలవు తీసుకున్నారు. దీంతో తాత్కాలిక సీపీగా గతంలో విజయవాడ సీపీగా విధులు నిర్వర్తించినటువంటి సురేంద్ర బాబును నియమించారు. విజయవాడ రాజకీయ నాయకులకు చుక్కలు చూపించడం అంటే సాధారణమైన విషయం కాదు, కానీ సురేంద్రబాబు ఆ పనిని అలవోకగా చేసి చూపించారు. అలాంటి సురేంద్ర బాబును మరలా విజయవాడ నగర సీపీగా రప్పించండంతో ప్రతిపక్షాలు విమర్శల వాన కురిపిస్తున్నారు.
రెండు ప్రధాన కేసులు రాష్ట్రంలో సంచలనంగా మారిన తరుణంలో, వీటి నుండి తెలుగుదేశం నాయకులను ‘సైడ్’ చేయడానికే చంద్రబాబు నగర పోలీస్ కమీషనర్ మార్పు ఈ నిర్ణయం తీసుకున్నారని, వైసీపీకి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే విజయవాడలో సురేంద్ర బాబు ‘ఫ్లాష్ బ్యాక్’ చూసి వైసీపీ, కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని, అందుకే విమర్శలు కురిపిస్తున్నారని అధికార పార్టీ నాయకులు ‘కౌంటర్’ ఇస్తున్నారు. గత నెలలోనే ప్రస్తుత సీపీ తనకు నెల రోజుల పాటు సెలవు కావాలని కోరడం, దానిని డీజీపీ ఖరారు చేయడం జరిగి పోయిందని, ఈ కేసులన్నీ ఇపుడు రావడం కేవలం కాకతాళీయమేనని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు… సవాంగ్ ను సెలవుపై ప్రభుత్వమే కావాలని పంపినా, విధులు చేపట్టినటువంటి సురేంద్ర బాబు గురించి రాజకీయ వర్గాలతో పాటు విజయవాడ నగర ప్రజలకు కూడా తెలిసిన విషయమే. నిజంగా చెప్పాలంటే… అప్పట్లో యూత్ కు సురేంద్ర బాబు ఒక లీడర్, ఒక ఆదర్శవాది, ఒక ఐకాన్. సురేంద్రబాబు సీపీగా, ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమీషనర్ గా ఉన్న సమయం విజయవాడకు అద్బుత సంవత్సరాలుగా నగర వాసులు చెప్పుకుంటుంటారు. అలాంటి సురేంద్ర బాబు రాక విజయవాడ రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుతుందో తెలియాలంటే మరో నెల రోజుల సమయం గడవాల్సిందే!