Telugu

నిమ్మగడ్డ తిరిగొచ్చేటట్టు అయితే అసలు ఎన్నికలే వద్దు

Share

మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయ్యింది. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. ఎన్నికల పని ఆగకుండా తాత్కాలిక ఎన్నికల అధికారిని నియమించామని చేసిన అభ్యర్ధనను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది.

ఎన్నికల గురించి తాము ప్రస్తుతానికి వ్యాఖ్యానించమని అయితే తుది విచారణ మూడు వారాలలో ముగిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే తదుపరి హియరింగ్ ని మూడు వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జరుగుతున్న పరిణామాల బట్టి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశాలు అన్ని రకాలుగానూ కనిపిస్తున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.

ఒకవేళ అదే జరిగితే నిమ్మగడ్డని ఆ పదవిలోకి మళ్ళీ తీసుకోకతప్పే పరిస్థితి ఉండదు. అయితే అదే జరిగితే ఆయన పదవీ విరమణ చేసే వరకూ కరోనా కారణంగా చూపి ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే అంత ఆలస్యం జరిగితే ఇప్పటికే జరిగిన ఏకగ్రీవాలు అన్నీ రద్దయ్యి ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది.

ఏ రకంగా చూసినా ప్రభుత్వానికి ఈ విషయంలో నష్టమే. అయితే నిమ్మగడ్డ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం అధికార పక్షానికి లేదు. ఇప్పటివరకు జరిగిన రచ్చ కారణంగా ఆయన తమ పార్టీని ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టొచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.