Dance bars in Mumbai get legal permissionడ్యాన్స్ బార్లకు లైసెన్స్ లు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించడం సబబు కాదంటూ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దంటూ మహారాష్ట్ర సర్కార్ హెచ్చరించిన సుప్రీం, విద్యా సంస్థలకు ఒక కిలోమీటరు దూరంలో డ్యాన్స్ బార్లు తెరవడాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది.

మహిళలు రోడ్లపై అడుక్కోవడం, అసభ్య కార్యకలాపాలకు పాల్పడడం కంటే బార్లలో డ్యాన్స్ చేసుకోవడమే నయమంటూ బార్ డ్యాన్సర్ల సమర్ధించే వ్యాఖ్యలు చేసింది. డ్యాన్స్ అనేది ఒక వృత్తి అని, ఒకవేళ డ్యాన్స్ లు అసభ్యకరంగా ఉన్నట్లయితే, అది చట్టబద్ధమైన హక్కు కోల్పోతుందని, ప్రభుత్వం నియంత్రణా చర్యలు తీసుకోవచ్చు గానీ, నిషేధించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ నెల 12వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ డ్యాన్స్ బార్ రెగ్యులేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన పిదప, సదరు బిల్లులో పొందుపరిచిన నిబంధనలపై బార్ నిర్వాహకులు, యాజమాన్యాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీదట, సర్కార్ ను ఉద్దేశిస్తూ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది.