ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తనకు న్యాయం చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టులో ఆమె విన్నపానికి సరైన ఆశించిన స్పందన లేకపోవడంతో, తనపై విధించిన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వస్తుంది, తనకు న్యాయం జరుగుతుందని ఆశించిన రోజా ఆశలు అడియాశలు అయ్యే ఘటన చోటు చేసుకుంది.
రోజా దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు అసలు విచారణకు కూడా స్వీకరించకుండానే తిప్పికొట్టడం విశేషం. ప్రస్తుతం ఉన్న బెంచ్ ఈ కేసులోని వాదనలను వినలేమని స్పష్టం చేయడంతో, మరో బెంచ్ ను ఆశ్రయించే ఉద్దేశంలో జగన్ వర్గీయులు ఆలోచనలు చేస్తున్నట్లుగా కనపడుతోంది. ఇదే జరిగితే సోమవారం నాటికి రోజా పిటిషన్ విచారణకు రావచ్చని సమాచారం. అయితే దీనిపై వైసీపీ అధినేత జగన్ గానీ, రోజా గానీ ఒక నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఎదురైన అనుభవం రీత్యా మరో బెంచ్ కు వెళ్ళినా ప్రయోజనం ఎంత వరకు ఉంటుందనేది ప్రశ్నార్ధకంగా ఉండడంతో, అసలు వైసీపీ వర్గీయులు వ్యక్తపరుస్తున్న వాదనలో న్యాయం ఎంతవరకు ఉందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్పీకర్ నిర్ణయంపై కోర్టులకు వెళ్ళినా ప్రయోజనం ఉండదని అప్పట్లోనే ఆర్ధిక మంత్రి యనమల అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన నిజమేనని ప్రస్తుతం జగన్ వర్గీయులకు అర్ధమవుతున్నట్లు కనపడుతోంది.