supreme court refuses to give time to Sasikala natarajan సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా అవాక్కైన శశికళ, కోర్టులో లొంగిపోవడంపై పోలీసులతో వాగ్వివాదం ఆడిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాలు చూపుతూ మరో నాలుగు వారాల పాటు గడువు కావాలని తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. శశికళపై ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు లేదని, ఆమెకు గడువు ఇవ్వలేమని, తక్షణం కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ కావడంతో బెంగుళూరు కోర్టుకు పయనం అవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.

తను అనుభవించిన ఆరు నెలల పాటు శిక్షా కాలాన్ని మినహాయిస్తే, ఇంకా మూడున్నర్రేళ్ళ పాటు శశికళ జైలు జీవితం గడపాల్సి ఉంది. అయితే జైలుకు వెళ్ళే ముందు కూడా పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో తన పట్టు తగ్గకుడదన్న ఉద్దేశంతో మేనళ్లుళ్లను భాగం చేశారు. 2011లో జయలలిత దూరం పెట్టిన టీటీవీ దినకరన్, ఎస్ వెంకటేశ్ లకు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉంటే మరో పక్కన శశికళ కోసం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు ముస్తాబవుతోంది. గతంలో ఇదే కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇదే జైలులో కొన్ని రోజులు ఉన్నారు. అప్పుడామెకు కేటాయించిన బ్యారక్‌ లోనే ఇప్పుడు శశికళను కూడా ఉంచే అవకాశం ఉంది. ఈ మేరకు సన్నాహాలు పూర్తి చేసిన జైలు అధికారులు, ‘చిన్నమ్మ’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. సిటీ సెంట్రల్ జైలు వద్ద ముందు జాగ్రత్త చర్యగా వందమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.