Supreme Courtహైకోర్టు విచారణ చేస్తున్నప్పుడు దానిపై సుప్రీంకోర్టుకి వెళితే ఏమవుతుందో సామాన్య ప్రజలు కూడా చెప్పగలరు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్: 1పై హైకోర్టు విచారణ చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఊహించిన్నట్లుగానే, ఈ దశలో ఈ కేసు విచారణలో కలుగజేసుకోలేమని, ఈ కేసుని ముందు హైకోర్టులోనే తేల్చుకోమని చెపుతూ ఇక్కడితో ఈ కేసు విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది.

ఈనెల 23వ తేదీన అంటే మరో మూడు రోజులలో హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టబోతోంది. కనుక అప్పటి వరకు ఆగి హైకోర్టు జీవోపై స్టే కొనసాగించినా లేదా జీవోని కొట్టివేసినా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉంటే సహేతుకంగా ఉండేది. కానీ హడావుడిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి ‘నో’ చెప్పించుకొని తిరిగివచ్చింది.

చంద్రబాబు నాయుడు పర్యటనలలో తొక్కిసలాటలు జరిగి 11 మంది చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా జీవో నంబర్: 1 తీసుకువచ్చింది. అయితే దాంతో రాజకీయ నాయకుల పర్యటనలలో భద్రతని పెంచేందుకు నిర్దేశించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ షరతులు, నిబందనల సాకుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ఎవరూ సభలు, సమావేశాలు నిర్వహించుకోనీయకుండా పోలీసులు అడ్డుకొంటుండటంతో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ జీవోపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

హైకోర్టు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ జీవోని జనవరి 23వరకు సస్పెండ్ చేస్తున్నట్లు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఇన్నిరోజులుగా దానిని గట్టిగా సమర్ధిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడిన వైసీపీ నేతలు ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్ళిపోయారు. ఒకవేళ హైకోర్టు ఈ జీవోని రద్దు చేసినా లేదా స్టే కొనసాగించినా పోయేది ప్రభుత్వం పరువే కదా?