supreme-court_AP GENCOతెలంగాణ సర్కారుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ పరిధిలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఏపీ మూలాలున్న 1,250 మంది ఉద్యోగుల వేతనాలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత… ఏపీ మూలాలున్న సిబ్బందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించిన తెలంగాణ సర్కారు వారికి వేతనాలు కూడా నిలిపివేసింది. అదే సమయంలో తెలంగాణ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను తన పరిధిలోని సంస్థల్లోకి తీసుకునేందుకు ఏపీ సర్కారు కూడా విముఖత వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇదివరకే విచారణ జరిపిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర విభజన సమయంలో ఆస్తులు, అప్పుల పంపకానికి నిర్దేశించిన 58:42 నిష్పత్తిలోనే ఇరు రాష్ట్రాలు ఉద్యోగులకు వేతనాలివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై సంతృప్తి చెందని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదో ఒక రాష్ట్రం నుంచి తమకు వేతనాలు విడుదలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… ప్రస్తుతం ఈ ఉద్యోగులంతా తెలంగాణ పరిధిలోనే పనిచేస్తున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.