bcciబీసీసీఐకి దేశ సర్వోన్నత న్యాయస్థానం అల్టిమేటం జారీ చేసింది. ఆర్ఎం లోథా కమిటీ సూచించిన అన్ని సంస్కరణలనూ తుచ తప్పకుండా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. “మా సమయం వృథా చేయకండి. లోథా కమిటీ సూచనలను అమలు చేస్తామని చెప్పండి. లేదా తాము ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది” అంటూ బీసీసీఐపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.

దీనికి సమాధానంగా… అక్టోబర్ 17న తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని సుప్రీంకు బీసీసీఐ తెలిపింది. ఇదే సమయంలో బీసీసీఐకి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. లోథా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి అంగీకరించని క్రికెట్ సంఘాలకు నిధులను విడుదల చేయవద్దని సూచించింది. హడావుడిగా నిధులను పంపిణీ చేయాల్సిన అవసరం ఏముందని బీసీసీఐని ప్రశ్నించింది.

“మీరు లార్డ్స్ లా ప్రవర్తిస్తున్నారు. దారిలోకి వచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే మేమే మిమ్మల్ని దారిలో పెట్టాల్సి ఉంటుంది” అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం బీసీసీఐని హెచ్చరించింది. ఇందుకు ఎక్కువ సమయం కూడా ఇవ్వని ధర్మాసనం, కేవలం 24 గంటల్లో లోధా కమిటీ సిఫారసులను అమలు చేయాలని, లేని పక్షంలో బీసీసీఐను రద్దు చేస్తామంటూ హెచ్చరించిన మాటలు క్రీడా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.