Supreme Court given shock to Raghu Rama Krishna Raju వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకి చెందిన ఇండ్-భారత్‌ థెర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, దానిలో డైరెక్టర్లుగా చేస్తున్న అంబేడ్కర్ రాజ్‌కుమార్‌ ఘంట, దుంపల సుధాకర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వారు ముగ్గురూ తమ కంపెనీ తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.237.84 కోట్లు రుణం తీసుకొని చెల్లించకుండా ఎగవేశారు.

రఘురామ కృష్ణరాజు నిత్యం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల అవినీతి గురించి మాట్లాడుతుంటారు. అటువంటి వ్యక్తి ఇటువంటి ఆర్ధిక నేరానికి పాల్పడటం ఓ విశేషమైతే, అక్రమాస్తుల కేసులలో ఏ-2 నిందితుడిగా పేర్కొనబడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆయనపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం విశేషం.

ఇది పక్కన పెట్టి అసలు విషయానికి వస్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో సీబీఐ రఘురామ కృష్ణరాజు అంబేడ్కర్ రాజ్‌కుమార్‌ ఘంట, దుంపల సుధాకర్ రెడ్డిల ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దానిని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించగా వారి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారు ముగ్గురూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వారి పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వారినే ఎదురు ప్రశ్నించడం విశేషం. “మీరు బ్యాంక్ నుంచి రూ.237.84 కోట్లు రుణం తీసుకొని దానిని వేరే అవసరాలకి మళ్లించినట్లు బ్యాంక్ గుర్తించింది. హైకోర్టు కూడా గుర్తించింది. దాని కోసం మీరు ఫోర్జరీకి పాల్పడినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొంది. ఆ నిధులను మీరు మళ్లించినట్లు కూడా దానిలో పేర్కొంది. ఈ నేరాలను ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ధృవీకరించింది. మీరు ఆ నేరానికి పాల్పడినట్లు ప్రాధమిక ఆధారాలన్నీ ఉన్నాయి. కనుక సీబీఐ మీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయలేము. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది,” అని ధర్మాసనం స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు వారి వాదనలను తిరస్కరించి దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేయడంతో వారు ముగ్గురి మెడకు ముఖ్యంగా రఘురామ కృష్ణరాజు మెడకు ఉచ్చు బిగుసుకొంటున్నట్లే. కనుక బ్యాంకుకు ఆ సొమ్ము మొత్తం వడ్డీ, జరిమానాలతో సహా చెల్లించేసి ఈ కేసు నుంచి బయటపడతారా లేక రాజకీయంగా ఒత్తిళ్ళు చేస్తూ, చట్టాలలోని లొసుగులను వాడుకొంటూ కేసులు నడిపిస్తూ సొమ్ము చెల్లించకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తారో చూడాలి.

Exclusive Video Interviews: Watch & Subscribe