Supreme court and high court shocks ys jagan governmentఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈరోజు ఒక్క రోజే రెండు సార్లు కోర్టులలో మొట్టికాయలు పడ్డాయి. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులు అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుని సమర్ధించింది.

సత్వరమే రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతికూలమైన కేసులో కూడా సుప్రీంకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టికాయలు వేయించుకుంది.

మరో వైపు ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. అమరావతిలో రైతుల నుండి సమీకరించిన 1251 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతిని అభివృద్ధి చెయ్యకుండా భూములని పందేరం చెయ్యడం తగదని అమరావతి రైతులు కోర్టుని ఆశ్రయించారు.

ఇప్పటికే అమరావతి మీద కోర్టు వివాదాలు నడుస్తున్నందున అవి తేలే వరకు భూములలో యధాస్థితిని కొనసాగించాలని రైతులు వేసిన పిటీషన్లతో కోర్టు ఏకీభవించింది. 1251 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ లో ప్లాన్ చేసిన ఇళ్ల స్థలాలు పంపిణీకి దీనితో ఇబ్బంది కలిగినట్టే.