Superstar-Rajinikanth Disappoints Fans on political entry Superstar-Rajinikanth Disappoints Fans on political entryముందుగా చెప్పినట్టుగానే సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం ఉదయం తన అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు. నేడు మూడు జిల్లాల అభిమానులు సూపర్ స్టార్ ను కలుసుకునేందుకు చెన్నై రాగా, రాఘవేంధ్ర కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు. కన్యాకుమారి, దుండిగల్ జిల్లాల అభిమానులను నేడు ఆహ్వానించగా, రజనీకాంత్ సభా వేదికకు రాగా, అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

కేవలం గుర్తింపు కార్డున్న అభిమానులకు మాత్రమే లోనికి అనుతిస్తుండగా, నేటి నుంచి ఆరు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి. గత కొంతకాలంగా తన రాజకీయ ప్రవేశంపై ఎటూ మాట్లాడని రజనీకాంత్, ఈ సమావేశాల తరువాత ఓ స్పష్టతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. సొంత పార్టీ పెడతారా? లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? లేక అసలు రాజకీయాలే వద్దని అనుకుంటారా? అన్నది తమిళనాట అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటిగా మారిపోయింది.

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన రజనీ, తనపై చూపిస్తున్న ఇంతటి ఆదరణను జీవితాంతమూ మరచిపోబోనని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఎంతో కాలం నుంచి అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, వారు అలా కోరడంలో తప్పులేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఆశ ఉన్న వారిని దగ్గర చేర్చుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు.

భయం అన్నది తనలో, తన అభిమానుల్లో ఏ మాత్రం కనిపించదని చెప్పారు. ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన చెప్పకపోయినా, రజనీ ప్రసంగం రాజకీయాల ప్రస్తావనతోనే మొదలైంది. ఇక ఈ నెల 20 నుంచి తన కొత్త సినిమా మొదలవుతుందని తెలిపారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతానని, తనతో ఫోటో వారికి ఎంత ఆనందాన్ని అందిస్తుందో, తనకు అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నప్పుడు అభిమానులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.