Superstar_MP_Margani_Bharatఇంతకాలం వైసీపీలో గంటా అరగంట మంత్రులే ఉన్నారనుకొన్నారు రాష్ట్ర ప్రజలు. కానీ వైసీపీలో చెడ్డీ గ్యాంగులు, బ్లేడ్ బ్యాచులు, తొట్టి గ్యాంగులున్నాయని వాటితో జాగ్రత్తగా ఉండాలనే విషయం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ నిన్న బయటపెట్టారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కూడా మరో కొత్త విషయం బయటపెట్టారు.

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, “చెప్పాలనుకొంటే… నాకున్న టాలెంట్, ఫేస్‌ గ్లామర్‌తో ఒకటి కాదు… పది సూపర్ సినిమాలు చేయగలను. పది సినిమాలు కూడా సూపర్ హిట్ చేయగలను. సూపర్ స్టార్ కింద చేయగలుగుతాను. ఆ టాలెంట్ నాకుంది. ఒక్క రంగంలో కాదు… చాలా రంగాలలో నాకు టాలెంట్ ఉంది,” అని చెప్పారు.

వైసీపీలో సినిమాలలో నటించినవారు.. నటించాలనుకొనేవారికి కొదవలేదు. మంత్రి ఆర్‌కె. రోజాకు సినిమాలలో జబర్దస్త్ అనుభవం ఉంది. మంత్రి పదవి చేపట్టినా నేటికీ రాజకీయాలలో గొప్పగా నటిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకటి రెండు సినిమా అనుభవాలు కూడా ఉన్న మరో మంత్రి అంబటి రాంబాబు తన జలవనరుల శాఖ గురించి పెద్దగా మాట్లాడలేకపోయినా, ఏటా సంక్రాంతికి సంబరాల రాంబాబుగా మారిపోయి రోడ్లపై డ్యాన్సులు చేస్తూ తన టాలెంట్‌తో ప్రజలను రంజింప చేస్తుంటారు. ఆయన గంట అంటే నాకు అరగంట చాలంటారు అవంతి. ఆ మద్యన ఎంపీ గోరంట్ల మాధవ్‌ డర్టీ పిక్చర్ వీడియో ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.

మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు సినిమాలు తీసిన అనుభవం ఉంది. వారిలో నానికి గుడివాడలో క్యాసినో నడిపిన అదనపు అనుభవం కూడా ఉందని టిడిపి నేతలు పొగుడుతుంటారు. కానీ ఆయన నోరు తెరిస్తే ఇంతే సంగతులు. లక్ష్మీ పార్వతికి సినిమాల అనుభవం లేకపోయినా, ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతి రోజున మాత్రమే మీడియా ముందుకు వచ్చి ఆమె కంటతడిపెడుతూ ఆర్ద్రంగా మాట్లాడుతుంటే, తెలుగు డైలీ సీరియల్స్ చూసినా ఏడ్వని మహిళలు వెక్కివెక్కి ఏడుస్తారు.

వైసీపీలో ఇంతమంది కళాకారులున్నా పాపం ప్రజాసేవలో పడి అందరూ తమ టాలెంట్ వృధా చేసుకొంటున్నారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నానని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్ చెప్పుకొచ్చారు. తాను ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయాను కానీ వెళ్తే… సూపర్ స్టార్‌గా వరుసగా ఓ 10 హిట్లు ఇచ్చి ఉండేవాడినని భరత్‌ చెప్పుకొన్నారు. కనుక చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌ తదితర స్టార్ హీరోలు చాలా అదృష్టవంతులే అని చెప్పవచ్చు. భరత్‌ ఇండస్ట్రీలో ప్రవేశించి ఉండి ఉంటే వారందరూ కనుమరుగు అయిపోయేవారు కదా?