amyra-dastur-joins-metooదక్షిణాదిన ఓ ప్రముఖ హీరో అల్లుడు, యువ హీరో తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్ అమైరా దస్తర్, తాజాగా ఓ పత్రికకను ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి మరిన్ని వివరాలు చెప్పుకొచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరోతో సాంగ్ చేస్తుండగా, అనవసరంగా తనపై చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడని, ఆ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళితే, తనకు నరకం చూపించారని ఆరోపించింది.

ఉదయం ఎనిమిది గంటలకే షూటింగ్ కు పిలిచేవారని, తాను సిద్ధమై కార్వన్‌ లో కూర్చుంటే, సాయంత్రం ఓ ఐదు నిమిషాలు షూటింగ్‌ చేసి పేకప్ చెప్పేవారని, షూటింగ్ లేకుంటే తనకు విషయం చెప్పేవారు కాదని వెల్లడించింది. ఈ అనుభవంతో దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం పట్టుకుందని చెప్పింది. అయితే, ఈ విషయాలేవీ తన తల్లిదండ్రులకు చెప్పలేదని, ఆ హీరోకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని, అతని పేరును ఇప్పుడు తాను చెప్పలేనని, చెబితే తన కెరీర్‌ ని నాశనం చేస్తారని వాపోయింది.

అయితే ఏదొకరోజు అతగాడి పేరు చెబుతానని, ఆ హీరోని మాత్రం వదలేది లేదని అంది. అమైరా గతంలో ధనుష్ తో కలసి ‘అనేగన్’ అనే సినిమాలో (తెలుగులో అనేకుడు) నటించిన విషయం తెలిసిందే. ఆమె చెబుతున్న వివరాలను బట్టి ధనుష్ పైనే ఆరోపణలు చేస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ సినిమా సమయంలోనే వేధింపులను ఎదుర్కొని ఉంటుందన్న టాక్ ఊపందుకుంది. పలువురు అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు ధనుష్ అల్లుడన్న సంగతి తెలిసిందే.