Super Star Krishna Birthdayపరిశ్రమలో ఒక లెగసిని సృష్టించడమంటే కేవలం సినిమాల్లో నటించడం కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ అనితరసాధ్యమైన ప్రయోగాలు చేస్తూ నిరంతరం నిత్య శ్రామికుడిగా కష్టపడటం. ఇది కొందరికే సాధ్యమవుతుంది. వాళ్లలో సూపర్ స్టార్ కృష్ణది ప్రత్యేక స్థానం. 1965లో తేనె మనసులుతో ఆదుర్తి సుబ్బారావు లాంటి అగ్ర దర్శకులతో పని చేసే భాగ్యం తొలి చిత్రానికే కలగడం కృష్ణ చేసుకున్న అదృష్టం. కానీ కష్టపడితేనే మనుషులు మహాపురుషులవుతారనే మాటని నరనరాల్లో జీర్ణించుకున్న తత్వమది. అందుకే మూడో అవకాశమే రిస్క్ అనిపించే గూఢచారి 116లో రూపంలో తలుపు తడితే హార్థికంగా స్వాగతించారు గెలుపొందారు

సాక్షిలో అన్నెంపున్నం ఎరుగని పల్లెటూరి బైతుగా కృష్ణ నటన చూస్తే ఇంతకు ముందు జేమ్స్ బాండ్ గా చూసింది ఈయననేనా అని సందేహం కలుగుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఒరవడిని పరిచయం చేసిన అవే కళ్ళు, కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని నటించిన ఉండమ్మా బొట్టుపెడతా, ఆస్తులు అంతస్తులు, విచిత్ర కుటుంబం, అన్నదమ్ములు, తాళి బొట్టు, పచ్చని సంసారం కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. 1971లో మోసగాళ్లకు మోసగాడుతో కౌబాయ్ ప్రపంచాన్ని తెలుగు జానాలకు స్వంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ పేరు మీద పరిచయం చేయడం ఇప్పటికీ మరపురాని చరిత్ర. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న హీరోలకు కొదవే లేదు

ఎన్టీఆర్ లాంటి తిరుగులేని స్టార్ డం ఉన్న హీరోలు అల్లూరి సీతారామరాజుగా నటించాలని ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో 70 ఎంఎం స్కోప్ లో బాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా కెమెరాలను అద్దెకు తెచ్చి మరీ కృష్ణ ఆ పాత్రలో నభూతో నభవిష్యత్ అన్న రీతీలో జీవించడం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వయంగా అన్నగారే ఈ సినిమా చూశాక తన ఆలోచన విరమించుకునేంత గొప్పగా పండించారు. ఎన్టీఆర్ తోనే పోటీ పడుతూ దానవీరశూరకర్ణ రిలీజైన రోజే అదే కథతో కృష్ణ తన కురుక్షేత్రం రిలీజ్ చేయడం అప్పట్లో సంచలనం. అందులో ఓడిపోయినా ఆయన ధైర్యానికి ఇదో మచ్చుతునక. సింహగర్జన లాంటి జానపద చిత్రాలతో కృష్ణ విజయం అందుకున్నారు

1980 తర్వాత కొత్త తరం హీరోల తాకిడి మొదలయ్యాక కృష్ణ కొంత వెనుకబడ్డారు. చిరంజీవి బాలకృష్ణలు దూసుకొస్తున్న సమయమది. అయినా అగ్ని పర్వతం లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. 1986లో బాహుబలి రేంజ్ లో సింహాసనం తీయడం దానికొచ్చిన ఓపెనింగ్స్ చూసి జాతీయ మీడియా సైతం షాక్ అవ్వడం రికార్డుల్లో ఉంది. 1990 తర్వాత నెమ్మదించినా ఎస్వి కృష్ణారెడ్డి నెంబర్ వన్ తర్వాత మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ మొదలయ్యింది. మూడు వందల మైలురాయిని తెలుగువీరలేవరాతో అందుకున్నారు. అమ్మదొంగా లాంటివి కృష్ణ మాస్ స్టామినా ఇంకా చెక్కుచెదరలేదని నిరూపిస్తూ వచ్చాయి. జగదేకవీరుడు లాంటి ఫాంటసీలూ చేశారు

దర్శకుడిగా కృష్ణ ముద్ర చాలా ప్రత్యేకం. సింహాసనంతో పాటు కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, అన్న తమ్ముడు, ఇంద్ర భవనం, శంఖారావం, బాలచంద్రుడు లాంటి ఎన్నో హిట్లు ఇచ్చారు. పద్మాలయ బ్యానర్ మీద సతీమణి విజయనిర్మల దర్శకత్వంలో ఎన్నో మరపురాని ఆణిముత్యాలు ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున కొంత కాలం రాజకీయాల్లో ఉన్న కృష్ణ తిరిగి సినిమాలకే పరిమితమయ్యారు. మల్టీస్టారర్స్ లోనూ కృష్ణ తనదైన ముద్ర సాధించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్, రవితేజ లాంటి నిన్నటి ఇప్పటి తరం స్టార్లతో స్క్రీన్ పంచుకున్నారు. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా స్టూడియో అధినేతగా రాజకీయవేత్తగా ఎన్నో పాత్రలు పోషించిన సూపర్ స్టార్ గా కృష్ణ కీర్తి ఆకాశం భూమి ఉన్నంత కాలం శాశ్వతం