Sunrisers vs Knight Ridersమొదటి రెండు మ్యాచ్ లలో రెండు ఘనవిజయాలు సాధించి, మాంచి ఊపు మీదున్నట్లు కనిపించిన డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, తదుపరి రెండు మ్యాచ్ లలో కూడా ఓటములను చవిచూడాల్సి వచ్చింది. హైదరాబాద్ జట్టు విజయాలకు తొలుత ముంబై ఇండియన్స్ బ్రేక్ వేయగా, తాజాగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఎంపైర్లు హైదరాబాద్ ఓటమికి కారణమయ్యారు.

ఐపీఎల్ లో ఎంపైర్లు గల్లీ క్రికెటర్ల మాదిరి నిర్ణయాలు ప్రకటించడం ఇప్పటికే పలు విమర్శలను మూటకట్టుకున్న నేపధ్యంలో… కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఎంపైర్ల నిర్ణయం హైదరాబాద్ జట్టుకు శాపంలా మారింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కోల్ కతాను నిలువరించింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ను కట్టడి చేయడంతో, అసహనంతో షాట్ కోసం ప్రయత్నించి గంభీర్ వెనుదిరిగాడు.

అయితే అంతకు ముందే తొలి వికెట్ గా సునీల్ నరైన్ ను భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపగా, ఆ మరుసటి బంతికే రాబిన్ ఊతప్ప ఇచ్చిన క్యాచ్ ను కీపర్ పట్టుకున్నప్పటికీ, ఎంపైర్ నాటౌట్ గా ప్రకటించి అవాక్కు చేసాడు. మొదటి బంతి నుండి ప్రారంభమైన ఊతప్ప లైఫ్ ల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కొన్నిసార్లు రనౌట్ల రూపంలో హైదరాబాద్ ఫీల్డర్లు అవకాశం కల్పించగా, ఎంపైర్ మరోసారి కూడా లైఫ్ ఇచ్చి ఊతప్పను ప్రోత్సహించారు.

అయితే ఈ సారి అవాక్కయ్యే విషయం ఏమిటంటే… ఫీల్డ్ ఎంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ ఎంపైర్ కు అప్పగించగా, రిప్లై చూసిన అనంతరం, థర్డ్ ఎంపైర్ నాటౌట్ గా ప్రకటించి, హైదరాబాద్ ఫీల్డర్ల సహనాన్ని పరీక్షించారు. ఇంతగా ఎంపైర్ల తప్పిదాలు జరుగుతున్నా, హైదరాబాద్ జట్టు కెప్టెన్ వార్నర్, సహనాన్ని కోల్పోకుండా, సహచరులను ప్రోత్సహిస్తూ ఉండడం క్రీడా విశ్లేషకులను కట్టిపడేసింది. ఎంపైర్లు చేసిన ఈ తప్పిదాలతో రాబిన్ ఊతప్ప 39 బంతుల్లో 68 పరుగులు చేసి, కోల్ కతా 172 పరుగులు చేయడానికి కారణమయ్యాడు.

ఇక లక్ష్య చేధనను బాగానే ఆరంభించిన హైదరాబాద్ జట్టు తొలి వికెట్ ను 46 పరుగుల వద్ద కోల్పోయింది. దీంతో అక్కడ నుండి ప్రారంభమైన పతనం, నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే మిడిలార్డర్ లో యువరాజ్ కాసేపు మెరుపులు మెరిపించడంతో, మళ్ళీ సన్ రైజర్స్ జట్టు ఆశలు చిగురించాయి. కానీ కాసేపటికే యువరాజ్ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్ కు ఓటమి ఖాయమైంది. ఎంపైర్ల తప్పిదాలతో బతికిపోయి, కోల్ కతా విజయానికి కారణమైన రాబిన్ ఊతప్పకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.