ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ లో దారుణమైన ప్రతిభను ప్రదర్శించి చివరిస్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలిచిన విషయం తెలిసిందే. లాస్ట్ ప్లేస్ లో నిలిచినా పెద్దగా బాధపడని సన్ రైజర్స్ అభిమానులు, డేవిడ్ వార్నర్ పట్ల జట్టు యాజమాన్యం చూపించిన తీరును మాత్రం సహించలేకపోయారు.
వార్నర్ తో వాటర్ బాటిల్స్ మోయించిన నాటి నుండి సోషల్ మీడియాలో సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు, తాజాగా మరోసారి ఆ ఆటకు శ్రీకారం చుట్టారు. మరి అంతలా సన్ రైజర్స్ యాజమాన్యం నెటిజన్లకు ఎక్కడ దొరికేసింది? అంటే మళ్ళీ డేవిడ్ వార్నర్ పేరే ప్రముఖంగా వినపడుతోంది.
త్వరలో ఐపీఎల్ ఆక్షన్ జరగనున్న నేపథ్యంలో… జట్టులో ఎవరెవరిని తిరిగి ఉంచుకుంటారో తెలపాలని ఐపీఎల్ టీమ్ లను బీసీసీఐ కోరింది. ఇందులో భాగంగా కేన్ విలియమ్స్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ లను మాత్రమే సన్ రైజర్స్ తిరిగి తమ జట్టులో కొనసాగించనున్నామని స్పష్టం చేసింది.
అంటే డేవిడ్ వార్నర్ తో పాటు గత కొన్నేళ్లుగా జట్టుకు వెన్నుముకగా ఉన్న నెంబర్ 1 స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కూడా సన్ రైజర్స్ జట్టు ఆక్షన్ కు విడిచిపెట్టింది. ఈ తీరే నెటిజన్ల ముంగిట్లో సన్ రైజర్స్ దొరికిపోవడానికి కారణమైంది. ఇద్దరు టాప్ ప్లేయర్లను వదిలిపెట్టడంతో జట్టు సన్ రైజర్స్ యాజమాన్య తీరుతో అభిమానులు నెట్టింట ఆడేసుకుంటున్నారు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత జరిగిన టీ 20 వరల్డ్ కప్ టోర్నీ మరియు కివీస్ తో జరిగిన టీ 20 సిరీస్ లో వార్నర్ అద్భుతంగా రాణించడంతో ఖచ్చితంగా సన్ రైజర్స్ మళ్ళీ వార్నర్ ను జట్టులో కొనసాగిస్తుందని భావించారు. అలాగే టీ 20లలో నెంబర్ 1 బౌలర్ రషీద్ ఖాన్ ను రిలీజ్ చేయడం కూడా విస్మయానికి గురిచేసిన అంశమే. అందుకే ‘సన్ రైజర్స్’పై నెటిజన్ల వేట!