Kane Williamson captain Sunrisers Hyderabad for IPL 2018ఏప్రిల్ 7వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. క్రికెట్ ఫెస్టివల్ గా భావించే ఐపీఎల్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. చివరి నిముషంలో స్టీవెన్ స్మిత్ మరియు డేవిడ్ వార్నర్ లను పక్కకు తప్పించడంతో రాజస్తాన్ రాయల్స్ కు అజెంకా రహనే సారధ్యం వహిస్తుండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

ఈ ఏడాది విశిష్టత ఏమిటంటే… బరిలో ఉన్న ఎనిమిది జట్లల్లో ఏడు జట్లకు టీమిండియా ఆటగాళ్ళే కెప్టెన్సీ వహిస్తుండగా, ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మాత్రం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ పగ్గాలు అందుకున్నాడు. ముందుగా ఈ స్థానంలో డేవిడ్ వార్నర్ ఉండగా, బాల్ ట్యాంపరింగ్ వివాదంతో వార్నర్ ను తప్పించారు. నిజానికి ఈ స్థానంలో శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమిస్తారని భావించినప్పటికీ, ఆ స్థానం విలియమ్స్ కు దక్కగా, వైస్ కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యారు.

ఇక మిగిలిన ఏడు జట్లకు వస్తే… చెన్నై సూపర్ కింగ్స్ కు ఎప్పటిలాగా ధోని కొండంత అండగా ఉన్నాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (బెంగళూర్)కు, దినేష్ కార్తీక్ (కోల్ కతా నైట్ రైడర్స్)కు, అశ్విన్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)కు, గౌతం గంభీర్ (ఢిల్లీ డేర్ డెవిల్స్)కు, రహనే (రాజస్తాన్ రాయల్స్)కు, రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) తరపున బరిలోకి దిగనున్నారు. మరి ఎనిమిది జట్లల్లో ఏకైక విదేశీ కెప్టెన్ అయిన కేన్ విలియమ్స్ ఎలా రాణిస్తారో, హైదరాబాద్ ను ఎలా ఒడ్డున పడేస్తారోనని సన్ రైజర్ ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు.