Sunrisers Hyderabad Beat Royal Challengers Bangalore ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో టాప్ 4లోకి అడుగుపెట్టిన తొలిజట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. చావో రేవో అంటూ తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు మరోసారి అభిమానులను నిరుత్సాహపరుస్తూ దాదాపుగా ఈ సీజన్ నుండి వైదొలగింది. ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు టోర్నీ నుండి అవుట్ కాగా, రెండో జట్టుగా బెంగుళూరు నిలిచింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప బెంగుళూరు టాప్ 4లోకి ప్రవేశించే ఆస్కారం లేదు, అలాంటి అద్భుతాలు జరిగే అవకాశం కూడా లేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ విలియమ్సన్ 56, షకిబ్ హల్ హసన్ 35 మినహా ఇతర బ్యాట్స్ మెన్లు ఎవరూ రాణించలేదు. తేలికపాటి లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు తొలి 10 ఓవర్లలో 74 పరుగులు చేసి ఆన్ ట్రాక్ లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత ఏర్పడిన నాటకీయ పరిణామాలతో, చేతిలో వికెట్లు ఉండి కూడా 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 146 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ అందుకోలేకపోయారు. ఇందుకు కారణం సన్ రైజర్స్ బౌలింగ్ అని సరిపెట్టుకోవాలి!

బెంగుళూరు పేలవమైన ప్రదర్శన క్రికెట్ అభిమానులకు కొత్తేమీ కాదు. కానీ ఈ సీజన్ లో అయినా అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తారేమోనని ఆశించిన వారిని మరోసారి భంగపాటుకు గురయ్యేలా చేసారు. ఇప్పటివరకు జరిగిన 11 ఐపీఎల్ సీజన్లలో కేవలం మూడు, నాలుగింటిలో మాత్రమే బెంగుళూరు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చింది. అయినప్పటికీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. ఈ ఓటమితో కోహ్లి అండ్ డివిలియర్స్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు.