Manchu-Vishnuనేను వ్యక్తిగతంగా అభిమానించే హీరోలలో మంచు విష్ణు ఒకరు. ఆయన నటించిన రెండు, మూడు సినిమాలు నేను చూసాను. చాలా బాగా నటిస్తారు, మంచి నటుడు, హాలీవుడ్ కు వెళ్లాల్సిన హీరో, అనవసరంగా టాలీవుడ్ లో ఉండిపోయారేమోనని రెండు, మూడు సందర్భాలలో అనిపించింది. మళ్ళీ ఏదో 100 కోట్లు సినిమా కూడా ఏదో చేస్తున్నారని చెప్పారు, ఏమైపోతుందో ఇండస్ట్రీ!

ఇది జనసేన నేత కళ్యాణ్ దిలీప్ సుంకర చేసిన వ్యాఖ్యలు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు మరికొన్ని మాటలను కూడా కళ్యాణ్ దిలీప్ ప్రస్తావించారు. ఎదురుగా ఎవరైనా వెళ్తుంటే మోహన్ బాబు అడుగుతుంటారట… నాకు నమస్కారం పెట్టరా, గుడ్ మార్నింగ్ చెప్పారా అని..! పాపం అదే జబ్బు మంచు విష్ణుకు కూడా వచ్చేసినట్లుంది.

ఎవరు ఆయన్ని గుర్తించినా, లేకపోయినా మధ్యలో వచ్చేసి ‘నేనే పెద్ద నేనే పెద్ద’ అని చెప్పుకోవడం అలవాటైపోయింది అని కొంతమంది కుర్రాళ్ళు నాకు సందేశం పంపించారు. గతంలో కూడా చెప్పాను, ఇలాంటివన్నీ అయితే నా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, కుర్రాళ్ళు చెప్పినవి ఆ భాష, మాండలికం మారకుండా సులభంగా చెప్పే వ్యక్తిగా మాత్రమే తానున్నాను అంటూ దిలీప్ సుంకర అన్నారు.

దీనికి ముందు మెగాస్టార్ చిరంజీవి – జగన్ ల భేటీ పైన కూడా స్పందిస్తూ… ఆ ముఖ్యమంత్రి కుర్చీకి చిరంజీవి ఇచ్చిన గౌరవం అదని, ప్రజలు ఇచ్చిన మంత్రదండంతోనే ఆ కుర్చీలో కూర్చున్నారని, ఒక్కసారి ఆ కుర్చీ దిగిపోయాక జగన్ అయినా సరే సొంత ధియేటర్ లేకపోతే టికెట్ కొనుక్కునే సినిమా చూడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీ సమస్య పరిష్కారం నిమిత్తం ఒదిగిపోయిన చిరంజీవిగా చూడాలి తప్ప, ఒరిగిపోయిన చిరంజీవి కాదని, చిరు అలా అనడంపై అభిమానులు గానీ, సామాజిక వర్గానికి చెందిన వారు గానీ ఫీల్ అవ్వాల్సిన పని లేదని, ఇండస్ట్రీ అంతా చిరంజీవిని పెద్దగా పంపించిందని, ఇంత చక్కగా సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేసిన చిరంజీవిని చూసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.