Sunil-Narang-Supports-Liger-Movie-Exbhitors-Protestఒక వస్తువు కొన్నప్పుడు నాణ్యతా లోపం ఉన్నా లేదా హామీ ప్రకారం సంతృప్తికరంగా లేకపోయినా దాన్ని వెనక్కు తిరిగిచ్చే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. ఒక హోటల్ లో ఫుడ్డు నచ్చకపోతే ఓనర్ ని నిలదీస్తాం. బిల్లు తగ్గించడమో లేదా మాఫీ చేయడమో ఏదో ఒకటి చేస్తాడు. ఇంటర్ నెట్ కనెక్షన్ సరిగా లేకపోతే కస్టమర్ కేర్ ఫోన్ చేసి దబాయిస్తాం. ఆన్ లైన్ లో ప్రోడక్ట్ కొన్నప్పుడు ఏ మాత్రం తేడా అనిపించినా నిర్మొహమాటంగా రిటర్న్ పంపేస్తాం. అధిక శాతం రంగాల్లో ఉండే ఈ సౌలభ్యత ఒక్క సినిమా డిస్ట్రిబ్యూషన్ లో మాత్రం ఉండదు. ఇక్కడి హామీలకు రాతపూర్వక గ్యారెంటీలు తక్కువ. మాటలను నమ్మేసి కోట్లు కుమ్మరిస్తూ ఉంటారు.

లైగర్ బాధితుల చాఫ్టర్ మళ్ళీ తెరపైకి వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ ప్రకటించబోతున్నాడని తెలియడం ఆలస్యం బయ్యర్లందరూ సంఘటితంగా మారి హైదరాబాద్ లో ధర్నా చేయడం మొదలుపెట్టారు. టాలీవుడ్ నోటెడ్ డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్లలో ఒకరైన సునీల్ నారంగ్ ప్రత్యక్షంగా వచ్చి మద్దతు తెలపడంతో మీడియా దృష్టి దీని మీద ఇంకాస్త సీరియస్ గా పడింది. ఎక్కడో ముంబై థియేటర్ ఓనర్ నెగటివ్ కామెంట్స్ చేస్తే ఫ్లైట్ వేసుకెళ్లి మరీ పలకరించిన హీరో విజయ్ దేవరకొండకు తమ గోడు వినిపించదాని నిలదీస్తున్నారు. ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేసి తీరా అడగబోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన పూరిని డిమాండ్ చేస్తున్నారు

ఇక్కడ తప్పు ఎవరిదంటే అందరూ భాగస్తులే. మార్కెట్ పరిస్థితులను సరిగా అంచనా వేసుకోకుండా ట్రైలర్ బట్టో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టో ఆ కంటెంట్ మీద అంత రేట్ పెట్టొచ్చా లేదాని ఆలోచించకుండా గుడ్డిగా కోట్లు కుమ్మరించేసిన పంపిణీదారులదీ తప్పుంది. ఒక ఏరియాని హీరో కెపాసిటీకి మించి అయిదారు కోట్లు చెప్పినప్పుడు రిస్క్ తీసుకోకుండా ఉండాల్సింది. లేదా రిటర్నబుల్ పద్ధతిలో కొనాల్సింది . అంతే తప్ప అవుట్ రైట్ గా కొనేసి నష్టాలు వచ్చాక మొత్తుకుంటే లాభం లేదు. నిర్మాత ఎవరైనా సరే గరిష్టంగా ఎంత పిండుకోవాలనే దాని మీదే దృష్టి పెడతాడు. సినిమా పోతుందని తెలిసినా అయ్యో పాపం అని జాలి చూపడు

ఇది ఇప్పటి గోడు కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి విజువల్ ఎఫెక్ట్స్ జనరేషన్ దాకా ఎన్నో వ్యథలు కథలు డిజాస్టర్ల వెనుక ఉన్నాయి. అగ్రనిర్మాతగా వెలిగిన వాళ్ళు ఒక్క ఫ్లాపుతో రిటైర్మెంట్ తీసుకున్న దాఖలాలు ఎన్నో. ఒత్తిడి తట్టుకోలేక ట్యాంక్ బండ్ లో దూకిన ట్రాజెడీలున్నాయి. వేరే రంగంలో సంపాదించి సినిమాల మీద మోజులో డిస్ట్రిబ్యూషన్ లో దిగి చేతులు ఒళ్ళు కాల్చుకుని సున్నా అయిన లైఫులున్నాయి. పూరి సైతం ఇలా తప్పించుకునే ధోరణి కాకుండా నష్టాలకు సంబంధించి ఏదైనా స్పష్టమైన హామీ లాంటిది ఇచ్చి ఉంటే ఇవాళ పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు. ఇదో అంతులేని కథ. దీనికి ఇంటర్వెల్ తప్ప క్లైమాక్స్ ఉండదు