Sulabh Complex paid with 5 Rupees Cheque‘పెద్దనోట్ల’ రద్దుతో దేశంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకులకు వెళితే 2,000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తుండడంతో దేశంలో చిల్లర కొరత జనాలను పట్టిపీడిస్తోంది. దీంతో 2 వేల రూపాయి నోటుకు చిల్లర తెచ్చుకోవడం మరో పెద్ద సాహసంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల చిల్లర సమస్యల తీవ్రత తెలిపే ఘటన మధురైలో చోటుచేసుకుంది.

చిల్లర చేతిలో లేని ఓ వ్యక్తి అర్జెంట్ గా టాయిలెట్స్ కి వెళ్లవలసి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి దగ్గర్లోని సులభ్ కాంప్లెక్స్ లో టాయిలెట్ వినియోగించుకున్నాడు. అనంతరం బయటకు వచ్చిన వ్యక్తిని, ఆ సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడు డబ్బులడిగాడు. దీంతో తన దగ్గర డబ్బులు లేవని చెబుతూ, తను చెల్లించవలసిన 5 రూపాయలకు గానూ హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకుకు సంబంధించిన చెక్కు రాసిచ్చి, అకౌంట్ లో వెసుకోమన్నాడు. ఆ చెక్కును తీసుకుని బిత్తరపోవడం నిర్వాహకుడి వంతయ్యింది.

అయితే ఇదే సరైన నిర్ణయం అంటూ… మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ… ఎవరైనా పబ్లిక్ టాయిలెట్స్ ను వినియోగించుకుంటే చెక్కులు మంజూరీ చేయండంటూ సోషల్ మీడియాలో పెద్ద నోట్ల రద్దుపై జోకులు పేలుతున్నాయి. బహుశా సులభ్ కాంప్లెక్స్ ల వద్ద కూడా స్వైపింగ్ మెషీన్లు తెచ్చుకోవాలని లేదంటే వారికి కూడా భవిష్యత్తులో తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు.