sukumar ratnaveluటాలీవుడ్‌ ప్రముఖ సినిమాటోగ్రఫర్స్‌లో రత్నవేలు ఒకరు. ఈయన తెలుగు సినిమాలకే కాకుండా పలు తమిళ సినిమాలకు కూడా పని చేశారు. ఈయే తమిళంలో ‘రోబో’ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతటి ఘనత వహించిన సినిమాటోగ్రఫర్‌ అయ్యి ఉండి ఒక చిన్న సినిమాకు అది కూడా పారితోషికం లేకుండా పని చేయడం అనేది మామూలు విషయం కాదు. సుకుమార్‌తో తనకు ఉన్న స్నేహం కోసం చిన్న సినిమా అయిన ‘కుమారి 21ఎఫ్‌’కు సినిమాటోగ్రఫీని అందించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

సుకుమార్‌ సినిమాను తన సినిమాగా భావించాను కనుక ఈ సినిమాకు పారితోషికం లేకుండా పని చేశాను అని, ఆయన స్నేహం తనకు అన్నింటికంటే ముఖ్యం అని ఈయన చెప్పుకొచ్చాడు. ‘రోబో’ వంటి అంతర్జాతీయ స్థాయి సినిమా చేసిన తర్వాత ‘కుమారి 21ఎఫ్‌’ సినిమా చేస్తుంటే పలువురు విమర్శించారు. కాని తాను మాత్రం అవేవి పట్టించుకోకుండా తన స్నేహితుడు సుకుమార్‌ కోసం ఇది చేశాను అని ఈయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఈయన సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు. ‘బ్రహ్మోత్సవం’ కారణంగా ‘రోబో’ సీక్వెల్‌కు పని చేసే అవకాశం వచ్చినా వదులుకోవాల్సి వచ్చిందట.