sukumar next project Telugu Newsఓ పక్కన దర్శకుడిగా సినిమాలను తెరకెక్కిస్తోన్న సుకుమార్, మరో పక్కన కొత్త దర్శకులతో సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ‘దర్శకుడు’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను వచ్చే వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అశోక్, ఈషాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జక్కా హరిప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సుకుమార్ బ్రాండ్ తో ఈ సినిమా విడుదల కానుండడంతో పబ్లిసిటీకి డోకా లేకపోవచ్చు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలని భావిస్తుండడంతో, ఓ నెల రోజుల ముందు నుండి పబ్లిసిటీ చేయాలనే తలంపుతో ‘ఫస్ట్ లుక్’ విడుదలకు ముహూర్తం పెట్టినట్లుగా తెలుస్తోంది. ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ కొట్టిన సుకుమార్ కు ‘దర్శకుడు’ అనేది రెండవ సినిమా. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సుకుమార్ – రామ్ చరణ్ ల సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత ‘దర్శకుడు’ ఫస్ట్ లుక్ బయటకు రానుంది.