Sujana Chowdary - CM Ramesh joining bjp సుజనా చౌదరి, సీఎం రమేష్ … చంద్రబాబు వీరిద్దరికీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పార్టీలో ఎప్పటి నుండో ఉన్న వారిని కాదని ఇద్దరికీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు. రెండు సార్లు పొడిగించారు కూడా. సుజనాకి అయితే కేంద్ర మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు వీరిద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. నిన్న సుజనా చౌదరి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్టు గా మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ఎంతో చేసిందని, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అనుకున్నట్టు పని చెయ్యలేదని చెప్పుకొచ్చారు.

ఆ ఇంటర్వ్యూ చూస్తే ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నట్టే ఉంది. ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదు అని చెప్పినా టీడీపీలో ఉంటా అని చెప్పలేదు. టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాక కేసులతో సుజనా చౌదరిని వేధిస్తున్నారు. దీనితో ఆయనకు పార్టీ మారడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు. మరోవైపు లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన విజయసాయిరెడ్డి, సీఎం రమేశ్‌లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరపడం ఆకర్షించింది.

ముందు వెనుక వరుసలో కూర్చున్న విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్‌ పక్కన కూర్చొన్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని విలేకర్లు అడగగా ‘‘మీ హయాంలో ఏమేం చేశారో చెప్పమని రమేశ్‌ను అడిగాను’’ అని బదులిచ్చారు. దీనితో ఒకప్పుడు పార్టీకి విధేయులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారా అనే చర్చ జరుగుతుంది.