Sudheer babu hunt movie రీమేక్ చేయడం ఒక ఆర్టని పెద్దలు ఊరికే అనలేదు. ఇంకో భాషలో అవే సీన్లు అవే పాటలు తీసుకొచ్చి ఇక్కడ ఆర్టిస్టులతో తీయడమేగా ఇందులో రిస్క్ ఏముందని పైకి తేలిగ్గా అనుకోవచ్చు కానీ దిగితే గాని దీని లోతు తెలియదు. తమిళ నాట్టమై కంటే తెలుగు పెదరాయుడు బ్రహ్మాండంగా వచ్చినా, హిందీ దబాంగ్ ఇక్కడ గబ్బర్ సింగ్ గా రూపం మార్చుకుని విశ్వరూపం చూపించినా వాటిని ఆయా దర్శకులు చెక్కిన తీరు సరిగ్గా సూటయ్యే నటీనటులను ఎంపిక చేసుకున్న విధానం అంత గొప్ప ఫలితాలను ఇచ్చింది. కేరళలో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన ప్రేమమ్ మనదగ్గర జస్ట్ యావరేజ్ అయ్యింది. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ అసలు మ్యాటర్ లోకెళ్దాం.

సుధీర్ బాబు హంట్ రిలీజయ్యింది. పైకి ఓపెన్ గా ఇది ముంబై పోలీస్ రీమేక్ అని చెప్పలేదు కానీ నిజానికి హక్కులు కొని మరీ తీశారని ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ అక్కడ గొప్పగా ఆడింది. పృథ్విరాజ్ సుకుమారన్ – రెహమాన్ – జయసూర్య కాంబినేషన్ ని జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. కాంటెంపరరీ స్టోరీ టెల్లింగ్ కి కొత్త పాఠాలు నేర్పించే షాకింగ్ క్లైమాక్స్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. మల్లువుడ్ ప్రేక్షకుల నాడిని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు రోషన్ ఆండ్రూస్ ఆ రిస్క్ కు తగ్గట్టే గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. ఇంత గొప్ప విజయం సాధించినా ఇన్ని సంవత్సరాలు మనోళ్లు ఎందుకు వదిలేశారంటే కథలో ట్విస్టే కారణం.

ఎవరూ చేయకపోతేనేం ప్రయోగాలకు రెడీగా ఉన్నాను కదాని సుధీర్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. టాలీవుడ్ ఫ్యాన్స్ వెరైటీకీ ఎప్పుడూ పెద్ద పీఠ వేస్తారన్న నమ్మకంతో ముందుకెళ్ళిపోయాడు. డైరెక్టర్ గా మహేష్ కు బాధ్యతలు అప్పగించాడు. ముఖ్యమైన మార్పులని చెప్పారు కానీ నిజానికి ఎక్కడ ఉద్దేశం దెబ్బ తింటుందోనని కేవలం కొన్ని అంశాలు మాత్రమే చేంజ్ కు గురయ్యాయి. మిగిలినదంతా యథాతథం. సరే మన ఆడియన్స్ ఒప్పుకుంటారో లేదోననే అనుమానం చివరి ఇరవై నిముషాలు అలాగే తీసుకుని మిగిలిన ముప్పాతిక సినిమా స్క్రీన్ ప్లేని వేగంగా గ్రిప్పింగ్ గా పరుగులు పెట్టిస్తే ఖచ్చితంగా మనోళ్లు అంగీకరించేవారేమో. కానీ జరిగింది వేరు.

మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, అనుమానితులు, బాధితులు, సవా లక్ష సందేహాలు ఇలా ఒక క్రైమ్ థ్రిల్లర్ కు కావాల్సిన హంగులన్నీసెట్ చేసుకున్నారు కానీ అసలైన ఇంటెన్స్ డ్రామాని మిస్ చేసుకున్నారు. హంట్ టైటిల్ కు తగ్గట్టు స్పీడ్ గా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా ఓకే అనిపిస్తే రెండో సగం పూర్తిగా ట్రాక్ తప్పిపోతుంది. ఎంగేజింగ్ గా ఎపిసోడ్స్ లేకపోవడం వల్ల వచ్చిన చిక్కిది. పైగా ఫామ్ తగ్గిన సీనియర్ శ్రీకాంత్, ఎప్పుడో మర్చిపోయిన ప్రేమిస్తే భరత్ లతో పాటు సుధీర్ బాబు ఈ ముగ్గురే పదే పదే కనిపిస్తే సాధారణ ప్రేక్షకుడు ఏం ఎంజాయ్ చేస్తాడు. పైగా అసలు హీరోయినే లేకుండా. ఆవకాయ, మీగడ పెరుగు అలవాటైన ప్రాణాలకు వట్టి అన్నం పాలు పెడితే ఆకలెలా తీరుతుంది బాబూ.