Hyderabad_Theater_Crowds_Movie_Fansఒకప్పుడు కన్నడ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు అంత సదభిప్రాయం ఉండేది కాదు. ఆ కారణంగానే డాక్టర్ రాజ్ కుమార్, రవి చంద్రన్ లాంటి స్టార్ల చిత్రాలు అరుదుగా డబ్బింగయ్యేవి. వచ్చినా ఫలితాలు ఏమంత గొప్పగా ఉండేవి కాదు. 2000 సంవత్సరం తర్వాత అవి కూడా ఆగిపోయాయి. దాంతో అక్కడ తోపు తురుమ్ లనిపించుకున్న బడా స్టార్లు సైతం ఇక్కడ మార్కెట్ సంపాదించుకోలేక చూస్తుండిపోయేవారు. కమల్ రజని లాగా మనకూ అక్కడ ఫాలోయింగ్ ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ ఉండేది. కట్ చేస్తే కెజిఎఫ్ తర్వాత సీన్ రివర్స్. ఒక శాండల్ వుడ్ మూవీ పన్నెండు వందల కోట్లు వసూలు చేస్తుందని ఎవరు ఊహించారు. సరే ఇది గ్రాండియర్ కాబట్టి కాసేపు పక్కన పెడదాం

కాంతార కేవలం నెల రోజుల్లో ఏపీ తెలంగాణలో 50 కోట్ల గ్రాస్ దాటేసింది. హిందీలో 75 కోట్లు లాగేసింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే 400 కోట్లకు దగ్గరగా ఉంది. ఇంతా చేసి దీనికి ఖర్చు పెట్టిన బడ్జెట్ 16 కోట్లే. అసలు ఏ బిజినెస్ లో ఇంత రాబడి వస్తుందంటే తలలు పండిన ఫైనాన్షియర్ కూడా చెప్పలేడు. మనకు భాషే రాని ఒక ప్రాంతానికి చెందిన సంప్రదాయాన్ని దేవుడి ఆచారంతో ముడిపెట్టిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. అందుకే పట్టం కట్టారు. 2016 బిచ్చగాడు రిలీజైన టైంలో మొదటి మూడు రోజులు జనం లేరు. షోలు క్యాన్సిల్ చేసి థియేటర్లను షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. రెండో వారంతో మొదలుపెడితే వంద రోజుల దాకా ఆ పరుగు ఆగలేదు.

కేవలం యాభై లక్షలకు బిచ్చగాడు హక్కులను కొంటే అది తెచ్చింది పాతిక కోట్లకు పైమాటే. అమ్మ సెంటిమెంట్ మన జనాన్ని ఇంతగా పిండేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఏదో చేప దొరికిందని ఆశించిన నిర్మాతకు ఏకంగా బంగారు తిమింగలం పడ్డ విషయం కొంత ఆలస్యంగా తెలిసింది. 1983లో వచ్చిన ప్రేమసాగరంతో మొదలుపెడితే ఇలాంటి అద్భుతాలు ఎన్నో టాలీవుడ్ చరిత్రలో ఉన్నాయి. ఇవే కాదు స్ట్రెయిట్ గా తీసినవైనా అంతే. 2000లో తేజ తీసిన చిత్రంకు పెట్టిన బడ్జెట్ అరవై లక్షలలోపే. కానీ పది కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించింది. నువ్వే కావాలి రెండిళ్ళు, ఒక కాలేజీ, నాలుగు అవుట్ డోర్లు తప్ప అసలు ఖర్చే లేని ఒక క్లీన్ ఎంటర్ టైనర్. దాని ఇండస్ట్రీ రికార్డుల గురించి పుస్తకమే రాయొచ్చు

ఇవన్నీ ముందుగా ఊహించి ఈ స్థాయిలో ఆడతాయని తీసిన సినిమాలు కాదు. ఆ మాటకొస్తే ఫలానా కథలో ఎంత దమ్ముందో ఆడుతుందో లేదో చెప్పే జడ్జ్ మెంట్ అతికొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. కానీ ఏదో కొత్తగా ప్రయతించాలన్న తపన, ఎలా తీస్తే ఆడియన్స్ ని మెప్పించగలమో ఊహించే మేధాశక్తి ఉంటే దానికి వందల కోట్లు అవసరం లేదు. క్రియేటివిటీ ఉంటే కాసిన్ని లక్షలతోనూ గ్రాఫిక్స్ అవసరం లేని విజువల్ వండర్స్ సృష్టించవచ్చు. బాక్సాఫీస్ తో దాసోహం అనిపించుకునేలా చేయొచ్చు. మన గ్రామీణ మూలాలు, ఇతిహాసాలు, సాంప్రదాయాల్లో బోలెడు కథలున్నాయి. వాటిని వెతికే ఓపిక ఉంటే ఎవరైనా ఇలాంటివి తీయొచ్చు, చరిత్రలో ఒక పేజీని రాసుకోవచ్చు.