State Governments Covid Cases Calculationsకరోనా కారణంతో చనిపోయిన వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోడంపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీలతో ఆన్ లైన్ విచారణ జరిపిన విషయం సంచలనంగా మారింది. అయితే ఈ విచారణతో తేలిన అసలు విషయం ఏమిటంటే… ఇప్పటివరకు కరోనా కారణంతో ఆయా ప్రభుత్వాలు చూపిన లెక్కలకు, ప్రజలు దాఖలు చేసుకున్న లెక్కలకు ఎక్కడా పొంతన లేదు.

ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం చూపిన లెక్కల ప్రకారం తెలంగాణాలో 3993 ఉండగా, బాధితుల సంఖ్య మాత్రం 28 వేలకు పైచిలుకు ఉంది. అంటే 7 రెట్లు అధికం. ఇందులో విశేషం ఏమిటంటే, దాదాపుగా 4 వేల మంది చనిపోయినట్లు లెక్కల్లో చూపించిన సర్కార్, ఇప్పటివరకు 12 వేల మందికి పరిహారాన్ని అందించింది.

ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం అయిన గుజరాత్ లో ఈ లెక్కలు 10 వేలు మరియు 89 వేలు ఉండగా, దాదాపుగా బాధితుల సంఖ్య 9 రెట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 10 వేల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం చనిపోయినట్లు ఉండగా, పరిహారం మాత్రం 58 వేల మందికి పైగా సర్కార్ చెల్లించింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 14471 ఉండగా, బాధితుల సంఖ్య 36205 ఉంది.

ఏపీ మాత్రం పరిహారాన్ని చెల్లించడంలో ప్రభుత్వ లెక్కల కంటే తక్కువగానే ఉండడం విశేషం. తప్పు చేసినా సరిగా చేయాలన్న దానికి ఏపీ నిదర్శనమేమో? ఇలా ఏ రాష్ట్ర లెక్కలు చూసుకున్నా కరోనా మరణాల సంఖ్యతో బాధితుల సంఖ్య ఎక్కడా సరిపోవడం లేదు. నిజానికి కరోనా మరణాల లెక్కలను ప్రకటించే సమయంలోనే పలు మీడియా సంస్థలు గగ్గోలు పెట్టాయి. ఏపీలో అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘా కెమెరాలు పెట్టి మరీ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

State-Government-Calculations