govt employees fire on sakshi writingఛలో విజయవాడ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందంటూ జగన్ మీడియా సాక్షి రాసిన రాతలపై ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వం మాపై రాజకీయ పార్టీలను ఆపాదించవద్దని సాక్షిలో ఎవరైతే ఆ రాతలు రాసారో అవి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఎనామిని కమిటీ అనే తెరపైకి తీసుకువచ్చిన చీఫ్ సెక్రటరీకి ఆ కమిటీ ఎప్పుడు వేస్తారో కూడా తెలియదేమో అన్న భావన మాకు కలుగుతోందని అన్నారు. ఇండియన్ సర్వీస్ ఢిల్లీలో చేసి వచ్చారు కాబట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మరిచిపోయినట్లుగా మాకు అర్థమవుతోందని అన్నారు.

ఒక సీనియర్ ఉద్యోగి కంటే జూనియర్ ఉద్యోగి ఎక్కువ జీతం వచ్చి, సీనియర్ కు నష్టం జరిగితే అప్పుడు ఎనామిని ప్రయోగిస్తారని, ప్రస్తుతం సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా అందరికి ‘గుండు సున్నా,’ 6 నుండి 7 వేల రూపాయలు రికవరీ చేసిన పరిస్థితి నెలకొంది.

కేవలం కాలయాపన చేయడం కోసం చీఫ్ సెక్రటరీ మరో కమిటీ పేరు చెప్తున్నారని, అశుతోష్ మిశ్రా కమిటీ మూడున్నర్ర సంవత్సరాలు, ఆయన ఇచ్చిన నివేదికను అమలు చేయడానికి ఒక ఏడాది, మరలా ఆ నివేదిక మీద అధికారుల కమిటీ ఓ మూడు, నాలుగు నెలలు గడిపారని అన్నారు.

ఇప్పుడు మంత్రులు కమిటీ రన్నింగ్ లో ఉంది, అలా కాకుండా మరో ఎనామిని కమిటీ అని చెప్పడం, ఒక కుక్కని చంపాలంటే దానికి ‘పిచ్చి కుక్క’ అని పేరు పెట్టినట్లుగా, ప్రభుత్వం మమ్మల్ని చంపేయడం కోసం ఈ ఎత్తుగడలు వేస్తోంది తప్ప మరొకటి కాదని తీవ్రంగా స్పందించారు.

ఈ తాజా కమిటీని సీఎస్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. పీఆర్సీ అనేది ఒక ఉద్యోగి అమలు చేయాలంటే 100 సంవత్సరాల క్రితం ఉండేదని శశిభూషణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మండిపడ్డ బండి, మీరేమైనా బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసారా? అని ప్రశ్నించారు.

మీకు పిచ్చి పట్టిందా? లేదంటే మాకు పిచ్చి పట్టిస్తున్నారా? శశిభూషణ్ కుమార్ గారు చేయాల్సింది ఏమిటంటే ఇప్పటివరకు వచ్చిన పీఆర్సీ నివేదికలను చదువుకోవాలని, మీ ప్రకటనలు మతి లేనివారిగా మారుస్తున్నాయని, కావున ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.

ఆరోగ్య శాఖకు సంబంధించి బదిలీలు ఎప్పటి నుండో అడుగుతుంటే, నేడు ఉద్యమానికి వచ్చేసరికి బదిలీ చేయడం ఉద్యోగులను బెదిరించడం కాదా? సమ్మెలో వెళ్తున్న వారికి బదిలీలు చేస్తారా? సమ్మె కాలం అయిపోయిన తర్వాత బదిలీలు చేస్తే వేయడానికి తాము సిద్ధమేనని తెలిపారు.

ఉద్యోగుల బదిలీలు వెంటనే నిలుపుదల చేయాలని, ఇచ్చిన గైడ్ లైన్స్ లో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయని, ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్తూనే వైద్య శాఖలో బదిలీలు చేయడం ప్రభుత్వ బెదిరింపులుగా పరిగణిస్తున్నామని, ఒకవేళ బదిలీలు ఆపకపోతే, ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా నిలుపుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని బండి హెచ్చరించారు.