Star heroes taking break will get hits againబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఓ రెండేళ్లు సినిమాల్లో నటించనని ప్రకటించడం అభిమానుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. లాల్ సింగ్ చద్దా హిట్ అయ్యుంటే ఇలా నిర్ణయించుకునేవారు కాదు కానీ అంత కష్టపడి ఎనిమిదేళ్లు స్క్రిప్ట్ రాయించి తీసిన మూవీ మరీ దారుణంగా బోల్తా కొట్టడం అమీర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. దాంతో ముందు అనుకున్న మరో ఫారిన్ చిత్రం ఛాంపియన్స్ రీమేక్ ని వద్దనుకుని కేవలం నిర్మాణానికే పరిమితమవుతున్నాడు. థగ్స్ అఫ్ హిందుస్థాన్ ఫలితం తాలూకు ప్రభావం కూడా ఇంకా పచ్చిగానే ఉన్నట్టుంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ నిజంగా ఇలా బ్రేకులు విరామాలు తీసుకుంటే బ్లాక్ బస్టర్లు వస్తాయనే ప్రశ్న తలెత్తడం సహజం.

పాతికేళ్ల క్రితం చిరంజీవికి అచ్చం ఇలాగే బాక్సాఫీస్ వద్ద వరస పరాజయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. మెగాస్టార్ పనైపోయిందనే తరహాలో కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చేవి. ఒక ఏడాది గ్యాప్ తీసుకుని హిట్లర్ రీమేక్ తో కంబ్యాక్ కావడం అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నా కమర్షియల్ అంశాలు సరిగ్గా కుదరడంతో నిర్మాత ఎడిటర్ మోహన్ కు కాసుల వర్షం కురిసింది. కట్ చేస్తే మళ్ళీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఇంత పాత ఉదాహరణ ఎందుకనుకుంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రిజల్ట్ చూశాక అల్లు అర్జున్ చాలా మధన పడ్డాడు. అలా వైకుంఠపురములో ముందు రెండు ఖాళీ సంవత్సరాలున్నాయి

అతిథి తర్వాత ఖలేజా రావడానికి మహేష్ బాబు తీసుకున్న సమయం అక్షరాలా మూడేళ్లు. అలా అని వెంటనే హిట్టొచ్చిందా అంటే లేదు. వేగంగా దూకుడు చేస్తే అది ఇండస్ట్రీ రికార్డులు అందుకుంది. శ్రీనివాస కళ్యాణం దెబ్బకు నితిన్ లాంటి కుర్ర హీరో ఏడు వందల రోజులకు పైగా తెరకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత భీష్మతో మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టే అనిపించినా ఇటీవలి ఫ్లాపులతో ప్రస్తుతం చేస్తున్న షూటింగులకు బ్రేక్ ఇచ్చి మరీ ఆలోచనలో పడ్డాడు. సో ఈ లెక్కన కొత్త పాత తరంతో సంబంధం లేకుండా కేవలం పరాజయాలు వచ్చాయనే కారణంతో విరామాలు తీసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతున్నదనే విషయం స్పష్టమవుతోంది.

ఇక్కడ సీరియస్ గా తరచి చూడాల్సిన కొన్ని విషయాలున్నాయి. చేయబోయే సినిమా హిట్ అవుతుందా లేదానేది మరీ ఎక్కువగా ఆలోచిస్తే కెరీర్ ముందుకెళ్లదు. ఇవాళ కృష్ణ గారి గురించి మూడు వందల పైచిలుకు సినిమాలు చేశారని ఇంత గర్వంగా ఎలా చెప్పుకుంటున్నాం. ఒకే సంవత్సరంలో పద్దెనిమిది రిలీజులు ఆయనకు ఎలా సాధ్యమయ్యాయి. ఫలానా కథ ఖచ్చితంగా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని ముందే చెప్పలేనప్పుడు మన వంతు విధిగా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తే పెట్టుబడులు తిరుగుతాయి, పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతే తప్ప బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా హిట్ వస్తుందన్న భరోసా ఎవరూ ఇవ్వలేరు.