Star Heroes Brothers with Brand difficultiesఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే నానుడి ఒకటుంది. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలకు ఈ స్టేట్ మెంట్ అచ్చంగా సరిపోతుంది. అల్లు శిరీష్ హీరోగా రూపొందిన ఊర్వశి రాక్షసివోకు బ్యాడ్ టాక్ రాలేదు. యూత్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. రివ్యూస్ నెగటివ్ గా కనిపించలేదు. ఇంకేం అల్లు తమ్ముడికి పెద్ద హిట్టొచ్చిందన్న ఆనందంతో గీతా ఆర్ట్స్ వెంటనే సక్సెస్ మీట్ పెట్టేసి బన్నీని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి హంగామా చేసింది. ఇంతా జరిగి బాక్సాఫీస్ వద్ద మాత్రం దాని తాలూకు ఫలితం కనిపించడం లేదు. అసలు మొదటి మూడు రోజులే అంతమాత్రంగా ఉంటే తర్వాత ఇంకా నెమ్మదించింది.

పుష్ప తర్వాత అల్లు బ్రాండ్ ని అరవింద్ & బన్నీ టీమ్ విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. ఎక్కడికి వెళ్లినా తగ్గేదేలే అంటూ జనాలు ఆ మంత్రాన్ని మర్చిపోకుండా ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూనే ఉంది. మొన్న జరిగిన శిరీష్ ఫంక్షన్ లో కూడా అందరూ అసలు విషయాన్ని మర్చిపోయి అసలు షూటింగే మొదలుకాని పుష్ప 2 గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చుకుంటూ టైం పాస్ చేశారు. ఇక ఈవెంట్ ఉద్దేశం నెరవేరమంటే ఎలా అవుతుంది. నిజానికి ఊర్వశివో రాక్షసివోకు ఆశించిన దానికన్నా మంచి రెస్పాన్సే రావాలి. కానీ రోజురోజుకు నెమ్మదిస్తున్న వసూళ్లలో అది కనిపించడం లేదు

మొత్తంగా చూస్తే అల్లు బ్రాండ్ కేవలం బన్నీకి తప్ప సోదరుడికి ఎంతమాత్రం ఉపయోగపడేలా లేదు. శిరీష్ లో కమర్షియల్ హీరోయిక్ ఫీచర్స్ లేకపోయినా ఏదో మంచి కంటెంట్ ఉన్న కథలు పడితే ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేసుకుంటూ కెరీర్ మెల్లగా బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉండేది. కానీ క్రమంగా అలా జరిగే సూచనలు కనిపించడం లేదు.ఒకప్పుడు నాగబాబుని ఇలాగే ఫుల్ చేయాలని చూసి ఒకదశ దాటాక చిరంజీవి తన వల్ల కాదని వదిలేశారు. నిర్మాతగా మార్చేశారు. మళ్ళీ ట్రై చేద్దామని పవన్ కళ్యాణ్ ని దించితే అతను మాత్రం అన్నకు తగ్గ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయి పవర్ స్టార్ గా నిలిచారు.

ఇలా అన్నయ్య క్యాలికులేషన్లు తమ్ముళ్లకు చాలాసార్లు పని చేయలేదు. రాజశేఖర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో తమ్ముడు సెల్వని గ్యాంగ్ మాస్టర్ ద్వారా పరిచయం చేశారు. ఆడియన్స్ కి నచ్చలేదు. సినిమాతో పాటు అతనూ ఫెయిలయ్యాడు. శ్రీకాంత్ మార్కెట్ పీక్స్ ఉన్నప్పుడు తమ్ముడు అనిల్ మేకాని ప్రేమించేది ఎందుకమ్మాతో సోలో హీరోగా ట్రై చేయించాడు. అది ఎంత పెద్ద డిజాస్టరంటే కనీసం దాని పేరు కూడా ఎవరికీ గుర్తు లేనంత దారుణంగా పోయింది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ వన్ మూవీ వండర్ గా మిగలకూడదంటే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సైతం ఇంకా ఏమి ఋజువు చేసుకోలేదు. తండ్రి వారసత్వాన్ని అందుకోవడానికి అన్నయ్య స్టార్ డం ని క్యాష్ చేసుకోవడానికి చాలా తేడాలున్నాయి మరి.