SS Thaman Devi-Sri-Prasadటాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే… ఎలాంటి తడబాటు లేకుండా దేవిశ్రీప్రసాద్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజమే… ప్రస్తుతం ఏ టాప్ హీరో అయినా దేవినే తమ సంగీత దర్శకుడిగా కావాలని కోరుకుంటున్నారు. దేవి కూడా అలానే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. పాటల విషయంలో దేవికి మరో సంగీత దర్శకుడ్ని నుండి పోటీ లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ సంగీతంలో మాత్రం థమన్ నుండి విపరీతమైన పోటీ నెలకొంటోంది.

ఒక విధంగా చెప్పాలంటే… హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలలో దేవి కంటే థమన్ సంగీతమే అదిరిపోతోందని చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే మణిశర్మ పేరే వినిపించేది. కానీ ప్రస్తుతం ఆయన శిష్యుడు థమన్ పేరు మాత్రమే మారుమ్రోగుతోంది. అన్ని రకాల సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ ను అందించడం థమన్ లోని అసలు స్పెషాలిటీ. ముఖ్యంగా ఇటీవల విడుదలైన “సైరా నరసింహారెడ్డి”కి అందించిన బ్యాక్ గ్రౌండ్ తో థమన్ కు యెనలేని పేరు ప్రఖ్యాతలు వచ్చిపడ్డాయి.

ఆ తర్వాత విడుదలైన ఎంటర్టైన్మెంట్ మూవీ “మహానుభావుడు”కు ఆహ్లాదకరమైన బ్యాక్ గ్రౌండ్ ను ఇచ్చి మెప్పు పొందిన థమన్, తాజాగా “రాజు గారి గది 2” సినిమాకు హార్రర్ మ్యూజిక్ ను అందించి, ఒకే సమయంలో తనకున్న వేరియషన్స్ ను ప్రేక్షకులకు తెలిసి వచ్చేలా చేసాడు. నిజానికి ఇప్పటివరకు థమన్ అందించిన పాటలపై విమర్శలు వచ్చాయి గానీ, బ్యాక్ గ్రౌండ్ పై మాత్రం వచ్చిన సందర్భాలు తక్కువ. పాటల్లో దేవి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే, బ్యాక్ గ్రౌండ్ లో థమన్ కూడా అదే ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు.