RRR - Acharya- Bheemla- Nayakఒక్క సినిమా రిలీజ్ డేట్… ఎన్ని సినిమాల మీద ప్రభావితం చూపుతుందో అని చెప్పడానికి “ఆర్ఆర్ఆర్” ఒక ఉదాహరణగా నిలుస్తోంది. సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రభావితం చేసి వాయిదాలు వేయించిన “ఆర్ఆర్ఆర్” మరోసారి దాదాపుగా అదే పంథాను అనుసరిస్తోంది.

2020 నుండి 2022 వరకు నాలుగు సార్లు వాయిదా పడిన అనంతరం, ఇటీవల రెండు రిలీజ్ డేట్స్ ను “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రకటించింది. మార్చి 18వ తేదీ గానీ, ఏప్రిల్ 28వ తేదీన గానీ రిలీజ్ చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్, తాజాగా మార్చి 25వ తేదీన విడుదల అని ప్రకటించింది.

దీంతో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఈ సారైనా ఎలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా రిలీజ్ కావాలన్నది సినీ అభిమానుల ఆకాంక్ష. ఈ తాజా రిలీజ్ డేట్ తో మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమా ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

‘ఆచార్య’ ఎలాగూ వెనక్కి వెళ్ళింది కాబట్టి ఏప్రిల్ 1వ తేదీన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అంతా సర్దుమణిగితే ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేస్తాము, ఒకవేళ అలా రిలీజ్ చేయలేని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీన చేస్తామని ‘భీమ్లా నాయక్’ చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మార్చి 11వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ తాజా రిలీజ్ డేట్స్ ప్రకటనలతో ఈ సమ్మర్ నుండి మహేష్ బాబు “సర్కార్ వారి పాట” దాదాపుగా అవుట్ అయినట్లుగానే భావించవచ్చు.

లాస్ట్ నాట్ బట్ లీస్ట్… సెంటిమెంట్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే సినీ ఇండస్ట్రీ, ‘ఆర్ఆర్ఆర్’ గత రిలీజ్ డేట్లన్నీ ‘5’వ నెంబర్ చుట్టూ తిరగగా, తాజాగా రాజమౌళి ఆ అయిదవ సంఖ్యను పక్కన పెడుతూ 25.03.2022 (టోటల్ 7) తేదీన ప్రకటించడంతో ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.