Rajamouli Oscarsచెన్నకేశవరెడ్డి సినిమాలో ఈ పాట రాసింది చంద్రబోసే. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చినప్పటికీ అందులో లైన్లు ఇవాళ ఆస్కార్ సంరంభం అయ్యాక ఖచ్చితంగా మళ్ళీ రాజమౌళే పాడుకోవాలి. కలలో మాత్రమే ఊహించగలిగే అకాడెమి పురస్కారాన్ని ఎట్టకేలకు సాధించిన జక్కన్న వైభవాన్ని చూసి బాలీవుడ్ పెద్ద తలకాయలన్నీ పైకి చెప్పకపోయినా లోలోపల రగిలిపోతున్న మాట వాస్తవం. అందుకే ట్వీట్లు అభినందనలు పరిమితంగా కనిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ ది ఎలిఫెంట్ విష్పరర్స్ తో కలిసి మొక్కుబడిగా పొగిడాడు తప్పించి ప్రత్యేకంగా ఆర్ఆర్ఆర్ గురించి ట్వీటలేదు.

ఇంకొందరు సెలబ్రిటీలకు అసలు తెల్లవారనే లేదు. ప్రధాని మోడీ శబాష్ అన్నారు. తమిళనాడు సిఎం స్టాలిన్ తో మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఇవాళ సాధించిన ఘనతను ప్రత్యేకంగా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అలాంటిది తాము బాలీవుడ్ ని శాశిస్తున్నామని గొప్పలు పోతున్న స్టార్లకు మాత్రం తీరిక దొరకడం లేదు. కారణం దక్షిణాది దర్శకుడు ఇంత గొప్ప స్థాయిలో నీరాజనాలు అందుకోవడం జీర్ణం కావడం లేదు. దేశదేశాల్లో ఆర్ఆర్ఆర్ కు పడుతున్న బ్రహ్మరథాన్ని ఇప్పటికీ నమ్మలేని వాళ్ళ సంఖ్య వందల్లో కాదు లక్షల్లో ఉంది.

Also Read – జైలు జీవిత పుష్కరాలు… మళ్ళీ గుర్తుకొస్తున్నాయా..?

ఇకపై కూడా ఇది కొనసాగుతుంది. తాము ఎంత బ్రతిమాలుకున్నా తెలుగు హీరోలతో జట్టు కడుతున్న రాజమౌళి మీద అక్కసు పెంచుకున్న వాళ్ళు అన్ని భాషల్లోనూ ఉన్నారు. ఏ చిన్న అవకాశం దక్కినా చాలు కిందకు లాగడానికి ఎదురు చూస్తున్నారు. అయితే జక్కన్నఎక్కింది నిచ్చెన కాదు రంపం తీసుకుని మెట్లు కోయడానికి. రాకెట్ వేసుకెళ్లి అంతరిక్షపు సింహాసనం మీద కూర్చున్నాడు. చేరుకోవాలన్న ఆలోచనే పెద్ద సాహసం. తొంభై ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న టాలీవుడ్ లో మొదటిసారి ఒక తెలుగు పాట ఆస్కార్ ప్రతిమ అందుకోవడమంటే మాటలు కాదు.

రాబోయే రోజుల్లో ఇంకొంత కాలం ఈ ఆర్ఆర్ఆర్ విజయం తాలూకు సంబరాలు ఉంటాయి. తర్వాత మహేష్ బాబుతో సినిమా మొదలుపెట్టాలి. దానికి బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో కనీసం ఓ పేపర్ మీద అంచనా వేయడం కష్టమే. ఈసారి జపాన్ లాంటి దేశాల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు. అసలే ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ అడ్వెంచర్ అంటున్నారు. ఈ జానర్ నచ్చని వాళ్ళు ఉండరు. రెండు మూడు వేల కోట్లు కేవలం థియేట్రికల్ బిజినెస్ నుంచే వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే మెచ్చేవాళ్లను ఏడ్చేవాళ్ళను వదిలేయడమే ఇప్పటిదాకా రాజమౌళి చేసింది ఇకపై చేయబోయేది.

Also Read – శాంతమూర్తిగా చంద్రబాబు… క్యాడర్ ఊరుకుంటుందా..?