SS Rajamouli Best Director RRR New York Film Critics Circleమనం ఎంత బాగున్నా పక్కింటోడు సుఖంగా ఉంటే ఓర్వలేనితనం చాలా మందిలో ఉంటుంది. సినిమా క్రికెట్ రాజకీయం రంగం ఏదైనా సరే ఒకడు పైకొస్తుంటే నిచ్చెన లాగే ఛాన్స్ ఎక్కడ ఉందా అని వెదికే వాళ్ళు కోకొల్లలు. ఎదిగే వాళ్ళను చూస్తే ఆ స్థాయికి చేరుకోవాలనే స్ఫూర్తికి బదులు ఈర్ష్యతో రగిలిపోయి విషం చిమ్మే బాపతు జనాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సౌత్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, కాంతార రూపంలో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాక అక్కడి ఎందరో దర్శక నిర్మాతలకు కునుకు పట్టడం లేదు. అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ ల పెద్ద బడ్జెట్లే తోక ముడుస్తుంటే మనం అద్భుతాలు చేస్తున్నపుడు ఏడుపు కాక ఇంకేముంటుంది

ఇప్పుడు రాజమౌళి మీద అచ్చంగా ఇలాంటి చర్చే జరుగుతోంది. ఊహించిన దానికన్నా చాలా పెద్ద స్థాయిలో ఆర్ఆర్ఆర్ తీసుకొచ్చిన ఫేమ్ గురించి ఇప్పుడు దేశవిదేశాల్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. యుఎస్ లో ఎన్కోర్ పేరుతో ప్రీమియర్లు వేసినా జపాన్ లో ఐమ్యాక్స్ స్క్రీనింగ్స్ తో చరణ్ తారక్ లు స్పెషల్ గా ప్రమోట్ చేసినా ఒకటే స్పందన వస్తోంది. జక్కన్న టేకింగ్ కి భాషతో సంబంధం లేకుండా అందరూ స్పెల్ బౌండ్ అవుతున్నారు. ఇండియా తరఫున ఆస్కార్ నామినేషన్ కు అఫీషియల్ గా వెళ్లలేకపోయినా ట్రిపులార్ కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ జనరల్ క్యాటగిరీలో వచ్చేందుకు టాప్ మోస్ట్ వరల్డ్ టెక్నీషియన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ప్రకటించడం ఎంత సెన్సేషన్ అయ్యిందో చూస్తున్నాం

ఇదిప్పుడు నార్త్ బ్యాచ్ కి కంటగింపుగా మారడంలో ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు అసీం చబ్రా అనే పెద్ద మనిషి ఉన్నాడు. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి ప్రముఖుల బయోపిక్కులు రాసిన గొప్ప రైటర్. న్యూయార్క్ లో జరిగే ఫిలిం ఫెస్టివల్ కి డైరెక్టర్ కూడా. ఈయనకు రాజమౌళి ఫెవరెట్ సినిమాలంటే చిన్న చూపు. జక్కన్న తన టాప్ 10 లో ఫారెస్ట్ గంప్, లయన్ కింగ్ లు ఇష్టపడినందుకు ఈ చబ్రా వ్యంగ్యంగా ట్వీట్ పెట్టడం కావాలని తగులుకున్నట్టు ఉంది. ప్రపంచం మొత్తం కీర్తించిన రెండు అద్భుతమైన క్లాసిక్స్ ని బెస్ట్ గా చెప్పినందుకు ఇతనికి అంతగా ఎక్కడ కాలిందో మరి. అదే లిస్టులో రాజమౌళి ప్రస్తావించిన మాయాబజార్, బెన్ హర్, అపోకలిప్టో గురించి మాట్లాడడే.

వీళ్ళ శోకమంతా రాజమౌళికి ఎక్కడ ఆస్కార్ వచ్చేస్తుందోనన్న కుళ్ళు తప్ప మరొకటి కాదు. తమ మేకర్స్ కు కలలో కూడా సాధ్యం కానిది ఒక తెలుగు దర్శకుడు సాధిస్తున్నప్పుడు దీర్ఘాలు తీయడం సహజం. బాహుబలి టైంలో రిలీజైన ఆరు నెలల తర్వాత కూడా మేమింకా ఆ సినిమా చూడలేదని బిల్డప్ ఇచ్చిన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో స్టేజి మీద డాన్సులు చేసే దాకా వచ్చారు. ఇక్కడ తగ్గింది వాళ్ళు కాదు. వాళ్ళను అలా ఆడించేలా మన రేంజ్ పెరిగింది. అందుకే ఇంత దుగ్ధతో హిందీ బ్యాచ్ రగిలిపోతున్నారు. ఈ మంటలు చల్లారవు. నిజంగా జక్కన్న ఆస్కార్ సాధించాక వీళ్ళ కోసం ప్రత్యేకంగా బర్నాల్ క్రీమ్ ని తయారు చేయాల్సి ఉంటుంది