ss Rajamouli Baahubali 2 Caste allegationsపాపులర్ అయిన సినిమాలపై వివాదాలు చుట్టుముట్టడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. ఒక్కోసారి విడుదలకు ముందే వివాదాలు హైలైట్ అవుతుండగా, తాజాగా చరిత్ర సృష్టిస్తున్న ‘బాహుబలి 2’కు మాత్రం విడుదలైన మూడు రోజుల తర్వాత ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో తమ కులాన్ని కించపరిచేలా ప‌లు సీన్లు ఉన్నాయ‌ని ఆరెకటిక సంఘాలు హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు ఆఫీసు ఎదుట భారీ ధర్నాకు దిగాయి.

బాహుబ‌లి-2లో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదం ఉంద‌ని, అది ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంద‌ని వెలుగెత్తిన ఆరోపణ. సెన్సార్‌ బోర్డు కూడా ఈ పదానికి అనుమతినివ్వడమేంట‌ని ప్రశ్నిస్తున్న సదరు సంఘం వారు, ఈ సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని న‌గ‌రంలోని బంజారా హిల్స్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా నుంచి ‘కటిక చీకటి’ పదాన్ని వెంటనే తొలగించకుంటే రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చ‌రించారు.

ఒకవేళ అప్పటికి ఆ ప‌దాన్ని తొల‌గించ‌క‌పోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన ఉద్ధృతం చేస్తామ‌ని అన్నారు. చూడడానికి చిన్న వివాదంలా కనపడుతున్నప్పటికీ, కులానికి సంబంధించినది కావడంతో ప్రాధాన్యతను దక్కించుకుంది. అయితే ఈ వివాదంపై అటు చిత్ర యూనిట్ సభ్యులు గానీ, ఇటు సెన్సార్ బోర్డు వారు గానీ ఎవరూ స్పందించలేదు. ఓ పక్కన బాక్సాఫీస్ వద్ద ఆకాశమే హద్దుగా సాగిపోతున్న ‘బాహుబలి 2’పై వివాదాలు రేపడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.