SS Rajamouli Allu Arjun‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలో హీరో ఎవరన్నది అనేక పుకార్లు వినిపించాయి గానీ, ఇంతవరకు ‘ఎవరు’ అన్న దానిపై స్పష్టత రాలేదు. కాసేపు జూనియర్ ఎన్టీఆర్ పేరు బలంగా వినపడుతుంటే, మరికాసేపు మెగా కాంపౌండ్ బన్నీతో సినిమా చేయాలని ఒత్తిడి తీసుకు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, వీరిద్దరి పేర్లే ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ జాబితా నుండి బన్నీ పేరును సైడ్ చేయవచ్చనేది లేటెస్ట్ న్యూస్.

తన తదుపరి సినిమా కోసం అల్లు అరవింద్, అల్లు అర్జున్ లతో కలిసి రాజమౌళి చర్చలు జరిపారనేది ఇటీవల వినిపించిన వ్యాఖ్యలు. అయితే అలాంటి పరిణామాలేవీ చోటు చేసుకోలేదని తాజాగా ఖరారైన అంశం. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి, అల్లు అర్జున్ ల కలయిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బన్నీ ‘ఐ యాం ది చేంజ్’ చాలా బాగుందని, వ్యక్తిగతంగా ఇది చెప్పడానికి తనకు అవకాశం లభించలేదని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని బన్నీని అభినందించారు జక్కన్న.

ఆ తర్వాత మైక్ అందుకున్న అల్లు అర్జున్… ‘బాహుబలి 2’ సినిమా తర్వాత రాజమౌళిని వ్యక్తిగతంగా ఇదే కలవడం అని, ఈ సందర్భంగా దేశమంతా గర్వించే సినిమాను అందించినందుకు అభినందనలు తెలిపారు బన్నీ. అంటే ‘బాహుబలి 2’ రిలీజ్ నుండి ఇప్పటివరకు వీరిద్దరి కలయిక జరగలేదనే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పకనే చెప్పారు. దీంతో గతంలో హల్చల్ చేసినవన్నీ రూమర్లుగా తేలిపోయాయి. ఈ పరిణామాలతో జక్కన్న తదుపరి సినిమా జాబితాలో బన్నీ లేరన్న విషయం స్పష్టమైందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.