Pathaan_Aloneఅదేంటి ఇద్దరికీ కనెక్షన్ ఏంటనే డౌట్ వస్తోందా. అక్కడికే వద్దాం. దేశవ్యాప్తంగా పఠాన్ వీరవిహారం కళ్లారా చూస్తున్నాం. మొదటి రోజే వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి షాక్ ఇస్తే సెకండ్ డే సైతం డెబ్భై రెండు కోట్లకు పైగానే వసూలయ్యాయి. ఈ వీకెండ్ అయ్యాక బాలీవుడ్ చరిత్రలో ఇప్పటిదాకా నమోదు కానీ బిగ్గెస్ట్ ఫిగర్స్ ని చూస్తామని ట్రేడ్ పండితులు పందెం కాసి మరీ చెబుతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే నార్త్ లోని ప్రధాన నగరాల్లో ఆదివారం దాకా అర్ధరాత్రి ఒంటి గంటకు షోలు వేస్తున్నారు. అలా అని టికెట్ రేట్లకు రాయితీ ఏమీ లేదు. మల్టీప్లెక్సుల్లో కనీస ధర అయిదు వందల పైమాటే ఉంది కానీ తక్కువ లేదు

పఠాన్ 25న రిలీజైతే మలయాళంలో మోహన్ లాల్ కొత్త మూవీ అలోన్ ఒక రోజు ఆలస్యంగా విడుదల చేశారు. దీనికి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ అక్షరాల నలభై అయిదు లక్షలు. అది కూడా వరల్డ్ వైడ్ మొత్తం కలిపి. రెండో రోజు పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. లాలెట్టన్ కెరీర్ లోనే వరస్ట్ సంఖ్యలు కనిపిస్తున్నాయి. అసలు ఈ అలోన్ మీద జనాలకు ఏ మాత్రం ఆసక్తి లేదని అర్థమైపోయింది. పోనీ తీసినవారు ఊరు పేరు లేని దర్శకుడా అంటే అదీ కాదు. మనకు రాఘవేంద్రరావు ఎలాగో అక్కడ షాజీ కైలాష్ ది ఆ రేంజ్. మరి ఇంత క్రేజీ కాంబో తుస్సుమంది ఎందుకనే సందేహం రావడం సహజం

కేవలం స్టార్ పవర్ గుడ్డిగా జనాన్ని థియేటర్ కు తీసుకురాదని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కంటెంట్ లో ఉన్న నీరసం ట్రైలర్ లోనే కనిపించింది. దెబ్బకు ఫ్యాన్స్ కే అలోన్ మీద ఆసక్తి కలగలేదు. కనీసం ఒక ఆట చూద్దామన్న ఇంటరెస్ట్ కూడా కలిగించలేకపోయారు. చెప్పాలంటే గత ఏడాది అచ్చం ఆచార్యకు ఎదురైన పరిస్థితే ఆ అలోన్ కు వచ్చింది. చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ అన్నా ఆడియన్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు మోహన్ లాల్ కూ అనుభవమయ్యింది. వేగంగా సినిమాలు చేయడం కాదు వాటిలో విషయం ఉండేలా చూసుకోవాలన్న ప్రాధమిక సూత్రం మర్చిపోతే ఇదిగో ఇలాంటి ఫలితాలే వస్తాయి.

డిజాస్టర్ల నుంచి బయటపడి షారుఖ్ సింహాసనం అందుకుంటే దృశ్యం, లూసిఫర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ నుంచి మోహన్ లాల్ ఇలా మాన్స్ టర్, అలోన్ అంటూ వరసగా పరాభవం పొందుతున్నారు. అయితే ఇదిలాగే కంటిన్యూ అవుతుందని కాదు ఒకప్పుడు తిరుగులేని స్టార్ డం తో రాజ్యమేలిన హీరోలు లేట్ వయసులో చేసే పొరపాట్లు ఇప్పటి తరంలో వాళ్ళ మీద ఇంకో రకమైన అభిప్రాయాలు కలిగేలా చేస్తాయి. కాబట్టి ఎంపికలో జాగ్రత్తలు అవసరం. అవి లేకపోతే జరిగే పరిణామాలకు నిర్మాతల కన్నా ఎక్కువ బాధ్యత వహించాల్సింది హీరోలే.