Sriya Reddy and ran daggubati comments on Tollywood drugs caseమత్తుమందులకు అలవాటు పడ్డ కొందరు టాలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినీ పరిశ్రమ పరువును తీశారని నటి శ్రియా రెడ్డి వ్యాఖ్యానించింది. చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఓ బొమ్మల దుకాణాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ఈ ముద్దుగుమ్మ… డ్రగ్స్ మాఫియాలో ఎంతో మంది చిక్కుకోవడం దురదృష్టకరమని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. తెలుగులో ‘పొగరు’ సినిమాతో పాపులర్ అయిన ఆమె, హీరో విశాల్ అన్నయ్యను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉందన్న సంగతి తెలిసిందే. తొమ్మిదేళ్ల విరామం తరువాత ప్రస్తుతం ‘అండావ కానోమ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది శ్రియా రెడ్డి.

సంచలనంగా మారిన ఈ డ్రగ్స్ కేసుపై టాలీవుడ్ హీరో రానా స్పందిస్తూ… డ్రగ్స్ వ్యవహారాన్ని భూతద్దంలో చూడవద్దని, దానిని పెద్దది చేసి చూపడం వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించాడు. సమాజానికి డ్రగ్స్ ఏ మాత్రం మంచివి కావన్న రానా, విద్యార్థులు కూడా వాటికి బానిసలు కావడం బాధాకరమన్నాడు. చిత్ర పరిశ్రమలో కొందరు వీటికి అలవాటు పడి ఉండొచ్చని, సంచలనం కోసం ఈ కేసును ఉపయోగించుకోవద్దని, డ్రగ్స్ బాధితుల పేర్లు బయటపెట్టడం సరికాదని మీడియాను కోరాడు. ఇది చాలా సున్నితమైన సమస్య అని, ఒక హీరోకు ఏదైనా అలవాటు ఉంటే అభిమానులు కూడా వాటిని ఆచరిస్తారా? ఆ హీరోకు మందు, సిగరెట్ అలవాటు లేకుంటే ఎవరూ ముట్టుకోరా? అని కాస్తంత ఆవేశంగా ప్రశ్నించాడు.