srinivasa gargeya about ugadi in 2017‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిర్ణయంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం 2017లో ఎప్పుడు జరుపుకోవాలి? ఇప్పుడీ ప్రశ్న తెలుగువారి మదిని చెదపురుగులా తొలిచేస్తోంది. ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెల 29న ఉగాది సెలవు ప్రకటించాయి. కొన్ని పంచాంగాలు, క్యాలెండర్లు మాత్రం ఈ నెల 28నే హేవళంబి నామ సంవత్సర ఉగాది అని పేర్కొంటుండగా, మరికొన్ని మాత్రం 29వ తేదీన ఉగాది అని చెబుతున్నాయి. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ప్రముఖ పంచాంగవేత్త శ్రీనివాస గార్గేయ కూడా 28నే ఉగాది అని అంటుండడం మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది.

ప్రామాణిక గ్రంథమైన ధర్మసింధు ప్రకారం 28నే ఉగాదిగా నిర్ణయించినట్టు భారత ప్రభుత్వం పంచాంగ గణన పద్ధతిని అనుసరించే దృక్ సిద్ధాంతులు చెబుతుండగా, మార్చి 29న ఉదయం 8 గంటల వరకు పాడ్యమి తిథి ఉంది కాబట్టి ఆ రోజే ఉగాదిని జరుపుకోవాలని పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగాన్ని రూపొందించే సిద్ధాంతులు, ఛాయార్క, కరణార్క దృక్‌ సిద్ధాంత పద్ధతిని అనుసరించే పండితులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ పంచాంగకర్తలు 29నే ఉగాది అని స్పష్టం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 120 మంది వరకు పంచాంగకర్తలు ఉన్నారు. వీరు రూపొందించిన పంచాంగాలు, క్యాలెండర్లే ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉన్నాయి. పంచాంగ రచనకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని ఎంచుకుంటారు. ఈ కారణంగానే ఈ అయోమయ పరిస్థితి తలెత్తినట్టు చెబుతున్నారు. అయితే ఇది ఈనాటి సమస్య మాత్రమే కాదు.. శతాబ్దాలుగా ఇటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 1954లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ క్యాలెండర్ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు.

ఎన్‌సీ లాహిరి కార్యదర్శిగా ఉన్న ఈ కమిటీ అయనాంశను నిర్ణయించి పంచాంగ గణన చేయాలని సూచించింది. అయితే దీనిని ప్రమాణంగా పాటించకపోవడం వల్లే ప్రస్తుత సమస్య ఉత్పన్నమైంది. మరోవైపు తిథుల వంటి కంటికి కనిపించని అప్రత్యక్ష ప్రమాణాల కంటే, పూర్వ సిద్ధాంతాన్ని, కంటికి కనిపించే గ్రహణాలు, మౌఢ్యమి విషయంలో ప్రత్యక్ష ప్రమాణాలు పాటించాలని హైదరాబాద్‌ కు చెందిన సిద్ధాంతి ఆకెళ్ల జయకృష్ణ శర్మ చెబుతున్నారు. దీని ప్రకారం మార్చి 29న ఉదయం వరకు పాడ్యమి తిథి ఉంది కాబట్టి, ఆ రోజునే ఉగాది జరుపుకోవాలని చెబుతున్నారు.