Srikanth Addala Telugu Directorసినీ ఇండస్ట్రీలో ఒక్క సినిమా రాత్రికి రాత్రే ఎవరినైనా ‘సూపర్ స్టార్’ను చేసేస్తుంది… అలాగే ఆకాశంలో ఉన్న వారిని కూడా పాతాళంలోకి పడేస్తుంది… ఇప్పటికే చాలామంది జీవితాలలో నిరూపణ అయిన ఈ విషయం, శ్రీకాంత్ అడ్డాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తించిందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం… భారీ అంచనాలతో గతేడాది సమ్మర్లో విడుదలైన “బ్రహ్మోత్సవం” సినిమా దారుణ పరాజయం కావడమే.

టాలీవుడ్ టాప్ హీరోగా రాజ్యమేలుతున్న ప్రిన్స్ మహేష్ బాబు డేట్స్ తీసుకుని, ‘బ్రహ్మోత్సవం’ అంత దారుణమైన సినిమాను ఎలా తెరకెక్కించారు? అన్నదే శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ను డిసైడ్ చేసింది. అప్పటివరకు ‘క్లాసికల్ దర్శకుడు’గా సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న శ్రీకాంత్ ను, ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టివేసింది ‘బ్రహ్మోత్సవం’ సినిమా. ఈ సినిమా విడుదలై దాదాపుగా ఏడాది కావస్తున్నా, ఇప్పటివరకు మరో చిత్రాన్ని ప్రారంభించలేకపోయారు అడ్డాల.

చాలామంది హీరోలతో ప్రయత్నాలు చేసినప్పటికీ, శ్రీకాంత్ కు అవకాశాలు దక్కడం లేదని, మరీ విచిత్రం ఏమిటంటే… కనీసం కధ కూడా వినకుండా ‘నో’ చెప్తున్నారని, ఈ తరంలో టాలీవుడ్ కు మల్టీస్టారర్ సినిమా ట్రెండ్ ను పరిచయం చేసిన శ్రీకాంత్ ప్రస్తుత దుస్థితి ఇలా ఉందని… రకరకాలుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గతంలో మాత్రం మెగా కాంపౌండ్ హీరోలతో శ్రీకాంత్ ఓ సినిమా చేస్తున్నారని, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టినా అవి కార్యరూపం దాల్చలేదు.

శేఖర్ కమ్ముల మాదిరి తెలుగులో శ్రీకాంత్ అడ్డాలకు కూడా ఓ వర్గం అభిమానులున్నారు. సహజమైన పాత్రలతో ఆహ్లాదకరమైన సినిమాలను అందించడంలో శ్రీకాంత్ దిట్ట. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాల ఎటకారపు డైలాగ్ లను చక్కగా చూపించడంలో సిద్దహస్తుడు అడ్డాల. వీటన్నింటికి గత ఏడాది కాలంగా తెలుగు ప్రేక్షకులు దూరమయ్యారు. బహుశా ఈ ఏడాదిలోనైనా శ్రీకాంత్ ఖాతాలో ఓ సినిమా పడుతుందని ఆశిద్దాం. ఒక భారీ సినిమా ‘సక్సెస్ అండ్ ఫెయిల్యూర్’ పర్యవసానాలు ఎలా ఉంటాయో శ్రీకాంత్ అడ్డాలను చూస్తే అర్ధమవుతుంది.