if actress sridevi death happened in india‘కార్డియాక్ అరెస్ట్’తో చనిపోయిందని భావించిన శ్రీదేవి మరణంలో అనేక సందేహాలు నెలకొంటున్న నేపధ్యంలో… ఆమె పార్థీవదేహం కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు ప్రతి రోజూ నిరాశే ఎదురవుతోంది. ఈ కేసు ప్రస్తుతం దుబాయ్ లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు వెళ్ళడంతో… శ్రీదేవి పార్థీవదేహం రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. శ్రీదేవి మరణం ఓ ‘మిస్టరీ’ కాకుండా ఉండడానికి దుబాయ్ చట్టాలు బాగా ఉపయోగపడుతున్నట్లుగా స్పష్టమవుతోంది.

బహుశా ఇదే ఘటన ఇండియాలో జరిగి ఉంటే… ఈ పాటికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా అందరూ ఊహించవచ్చు. ఎందుకంటే… ఇండియాలో ఇలాంటి ‘మిస్టరీ’ డెత్ లు ఎన్నో ఎన్నెన్నో..! సినీ తారలు, రాజకీయ దిగ్గజాల కుటుంబాలలో జరిగిన మరణాలు… వాటి వెనుక ఉన్న కారణాలు… ఎప్పటికీ ‘మిస్టరీ’గానే మిగిపోవడానికి పూర్తి అవకాశం ఇండియాలో ఉన్నంతగా మరే ఇతర దేశంలో లేవని… ‘టెంపర్’లో ఎన్టీఆర్ ద్వారా పూరీ చెప్పించిన డైలాగ్ లు మనకు గుర్తుకు రాక మానవు.

ఇక శ్రీదేవి విషయానికి వస్తే… నిజంగానే ఎన్నో సందేహాలు… మరెన్నో అనుమానాలు కలుగక మానవు. 24వ తేదీన సాయంత్రం 5.50 నిముషాలకు బాత్రూమ్ లోకి వెళ్ళిన శ్రీదేవి బయటకు రాలేదని 6.05 నిముషాలకే బోనీ కపూర్ కు ఎందుకు అనుమానం వచ్చింది. సామాన్యంగా మహిళల పరిచర్యలు 15 నిముషాలేమిటి… ఇంకో 15 నిముషాలు అయినా గానీ పూర్తి కావు. కానీ 15 నిముషాలకే బోనీ కపూర్ కు ఎందుకు అనుమానం వచ్చింది? అలాగే హోటల్ సిబ్బంది చేత తలుపులు బద్దలు కొట్టించి డాక్టర్ ను పిలవకుండా, తన స్నేహితుడ్ని పిలవడం ఏంటి?

మరి తలుపులు బద్దలు కొట్టిన హోటల్ సిబ్బంది కూడా యాజమాన్యానికి ఈ సమాచారం అందించలేదా? బోనీ చెప్పిన ప్రకారమే 6.10కి శ్రీదేవిని బాత్రూమ్ నుండి బయటకు తీసుకువస్తే 9 గంటల వరకు హాస్పిటల్ కు తీసుకెళ్ళకుండా ఎందుకు ఉన్నారు? సెలబ్రిటీలకు చిన్న గాయం అయితేనే డాక్టర్ల దగ్గరకు పరుగులు పెడతారు. మరి అంత అపస్మారక స్థితిలో పడి ఉన్న శ్రీదేవిని వెనువెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని ఎందుకు అనిపించలేదు. ఈ సందేహాల పైన నివృత్తి చేసుకునేందుకే దుబాయ్ పోలీసులు బోనీ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు.

చూడబోతుంటే… బోనీ కపూర్ కేంద్రంగా ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనపడుతోంది. అవసరమైతే మళ్ళీ రీ పోస్ట్ మార్టంను కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటివరకు దుబాయ్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కావడం లేదు. నిజానికి అలాంటి చట్టాలు దుబాయ్ లో లేవు. ఎవరో మాట్లాడి లాబీయింగ్ చేస్తేనో, ఎవరో పలుకుబడి ఉపయోగిస్తేనో దుబాయ్ చట్టాలు ప్రభావితం కావు. నిజానికి అలాంటి చర్యలు కూడా జరగవని శ్రీదేవి మరణం ద్వారా ఇండియా జనులకు తెలిసి వచ్చినట్లయ్యింది.

దీంతో శ్రీదేవి మరణంపై రాజకీయ దిగ్గజం అమర్ సింగ్ దుబాయ్ షేక్ తో మాట్లాడారని వచ్చిన వార్తలు హాస్యాస్పదంగా మారాయి. ఇండియా చట్టాలను తక్కువ చేయడం కాదు గానీ, దుబాయ్ చట్టాల తీరుతెన్నులు తెలుసుకున్న తర్వాత మనదేశంలోని చట్టాలపై, ఉన్న లొసుగులపై వ్యంగ్యంగా మాట్లాడుకోవడం సామాన్య ప్రజల వంతవుతోంది. ముఖ్యంగా మన దేశంలో ఉన్న చట్టాలు సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు అతీతం అని ఎన్ని కృష్ణజింకలు చెప్పాయో… ఎన్ని తుపాకీ గుళ్ళు చెప్పాయో… ఎంతమంది హీరోయిన్ల అకాల మరణాలు చెప్పాయో..?!