YS-Jagan-YSRCPదేశవ్యాప్తంగా హిందువులు అందరూ జరుపుకొనే పండుగలలో వినాయకచవితి కూడా ఒకటి. ఈనెల 31న వినాయకచవితి పండుగ ఉన్నందున అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలలో గణేశ్ విగ్రహాలు తయారవుతున్నాయి. ఊరూరా గణేశ్ నవరాత్రి ఉత్సవాల కోసం మండపాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఏడాది కూడా వైసీపీ ప్రభుత్వం వినాయకచవితి పండగ జరుపుకోవడంపై ఆంక్షలు విధించింది. ప్రతీ వినాయక మండపానికి తప్పనిసరిగా రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలని ఆదేశించింది . దాంతో పాటు అనేక ఆంక్షలు కూడా విధించింది. దీనిపై ప్రజలు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీశ్రీనివాసనంద సరస్వతి స్వామి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హిందువులపైనే ఆంక్షలు విధిస్తారా?ఇతర మతాల పండగలలో కలుగజేసుకొని వైసీపీ ప్రభుత్వం హిందువుల పండగలలోనే ఎందుకు జోక్యం చేసుకొంటోంది? ఇటువంటి ఆంక్షలు విధిస్తోంది? వైసీపీకి 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెట్టినందుకు హిందువులపై కక్ష సాధిస్తోంది. సిఎం జగన్మోహన్ రెడ్డి తనకు అన్ని కులాలు, మతాలు సమానమేనని చెపుతుంటారు. మరి హిందువులు చేసుకొనే వినాయకచవితి పండగపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు?ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేకుంటే వచ్చే ఎన్నికలలో హిందువులు మీ పార్టీకి గట్టిగా బుద్ధి చెపుతారు,” అని హెచ్చరించారు.

గత ఏడాది కూడా కరోనా సాకు చూపుతూ వీధుల్లో వినాయకుడి విగ్రహాలు అమ్మకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. కానీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొంది. ఆ తర్వాత విగ్రహాల నిమజ్జన సమయంలో ఆంక్షలు విధించడంతో, ఇళ్ళలో వినాయకచవితి పూజలు చేసుకొని విగ్రహాలను నదులు, సముద్రంలో విగ్రహాలు కలిపేందుకు వెళ్ళిన సామాన్య ప్రజలు నిమజ్జనం చేసుకోలేక విగ్రహాలను పట్టుకొని వెనక్కు తిరగాల్సివచ్చింది. ఈ ఏడాది కూడా ప్రజలు వినాయకచవితి పండగ జరుపుకోవడానికి ఆంక్షలను భరించాల్సివస్తోంది. ఇది అదనపు రాబడి కోసమా లేక హిందువుల పట్ల చులకనభావమా?