sri-reddy-directly-reveals-another-big-name-liveనిర్విరామంగా మీడియాలకెక్కి రచ్చ రచ్చ చేయడం… ఆ తర్వాత తెరవెనుక సెటిల్మెంట్ జరగడం… అనేది ఇటీవల కత్తి మహేష్ విషయంలో జరిగిందంటూ అనధికారికంగా హల్చల్ చేసిన సమాచారం. ఇందులో వాస్తవం ఎలా ఉన్నా… మీడియాల వేదికగా జరిగిన ‘సెటిల్మెంట్’ వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారాయన్న అంశం అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అప్పటినుండి ఇటు పవన్ ఫ్యాన్స్ తో పాటు, అటు కత్తి మహేష్ కూడా సైలెంట్ అవ్వడం గమనించవచ్చు.

సరిగ్గా కత్తి మహేష్ మీడియాను వదిలిన కొన్నాళ్ళకు ‘సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్’ అంటూ రచ్చ రచ్చ చేయడం హీరోయిన్ శ్రీరెడ్డి వంతు వచ్చింది. అప్పటి నుండి మొదలైన హంగామా తాజాగా ‘సురేష్ బాబు తనయుడు’ అంటూ భారీ సంచలనం సృష్టించే వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. అంతకుముందు కొరటాల శివ, శేఖర్ కమ్ముల, నాని అంటూ ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న వారి పేర్లను ప్రస్తావించకుండా బయటపెట్టిన శ్రీరెడ్డి, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు మాత్రం చేస్తోంది.

అటు కత్తి మహేష్ ఉదంతంలో గానీ, ఇటు శ్రీరెడ్డి విషయంలో గానీ ‘కధలోని కంటెంట్’ ఒకేలా ఉండడం పరిశీలించదగిన అంశం. సాక్ష్యాలు ఉన్నాయంటారు గానీ బయటపెట్టరు, ఒక విధంగా బెదిరింపులకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీళ్ళే కాదు ఇంకా చాలా మంది తన జాబితాలో ఉన్నారంటూ పేర్లు చెప్పకుండా మరికొందరికి హిట్ ఇస్తోంది శ్రీరెడ్డి. ‘ఆత్మగౌరవం’ అంటూ కత్తి మహేష్ పోరాడి చివరికి సైలెంట్ అయితే అయ్యారు. మరి శ్రీరెడ్డి ఎలా సైలెంట్ అవుతుందోనని సినీ జనాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.