Sri-lanka-Vs-India-Testశ్రీలంకతో మొదలైన వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శనను కనపరిచింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 112 పరుగులకు ఆలౌట్ అయ్యి, శ్రీలంక విజయాన్ని సునాయాసం చేసింది. ఒకానొక దశలో 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో కనీసం 50 పరుగులు అయినా చేస్తుందా? లేదా? అనుకున్న తరుణంలో ధోని (65) బ్యాటింగ్ ప్రతిభతో కనీసం 100 పరుగుల మైలురాయిని చేరుకోగలిగింది.

స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక తొలి రెండు వికెట్లను త్వరగా కోల్పోయినప్పటికీ, తరంగ (49) దూకుడైన బ్యాటింగ్ తో మ్యాచ్ లో పట్టు సాధించింది. విరాట్ కోహ్లి వివాహం నేపధ్యంలో ఈ సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక్క విరాట్ కోహ్లి లేని జట్టు మరీ ఇంత పేలవమైన ప్రదర్శనను ఇవ్వడంతో, గతంలో సచిన్ లేని సమయంలో టీమిండియా ఏ విధంగా ఆడేదో అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చింది.

ఎప్పుడైనా సచిన్ ఒకటి, రెండు మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకుంటే, ఇదే రకమైన ఆట తీరుతో జట్టు ఓటమి పాలు కావడం, ఆ వెనువెంటనే సచిన్ జట్టులోకి రావడం అనేవి తెలిసినవే. ప్రస్తుతం విరాట్ కోహ్లి లేని టీమిండియా కూడా అదే తరహా ప్రదర్శన ఇస్తోందా? అన్న అనుభూతులను పంచుతోంది. అంతేకదా… క్రీజులోకి దిగిన ప్రతిసారి అభిమానులు సెంచరీలు కోరుకునే సచిన్, కోహ్లిలను వదిలేస్తే… నేడు జట్టంతా కలిసి సెంచరీ చేయడం గగనం అయిపోయింది.